Kakinada Port case : కాకినాడ పోర్టు విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కాకినాడ పోర్టుకు ఒక యజమానిగా వ్యవహరిస్తూ వస్తున్న కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కెవి రావు తన షేర్లను వైసీపీ నేతలు బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపీ సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. విజయసాయిరెడ్డి తో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిల పై సీఐడీ కేసు నమోదు చేసింది. వీరు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిఐడి. అయితే ఇది మనీ లాండరింగ్ కు సంబంధించిన విషయం కావడంతో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు మరో ఇద్దరికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం తో వెళ్తున్న షిప్ ఒకటి పట్టుబడింది. దానిని చూసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ తీరానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ వివాదం అలానే కొనసాగుతుండగా కర్నాటి వెంకటేశ్వరరావు రంగంలోకి వచ్చారు. కాకినాడ పోర్టుపై తనకున్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డిల పై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపుకు దారితీసింది.
* జరిగింది ఇది
ఈ ఏడాది మేలో 2500 కోట్ల రూపాయల విలువ చేసే కాకినాడ సి పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ షేర్లను కెవి రావు నుంచి బలవంతంగా బదలాయించుకున్నారన్నది వారిపై వచ్చిన ప్రధాన ఆరోపణ. సి పోర్టు లిమిటెడ్ షేర్ల మొత్తం విలువ 2500 కోట్ల రూపాయలు కాగా.. వాటిని 494 కోట్లకు.. 1109 కోట్లు విలువ చేసే సెజ్ షేర్ల విలువను అతి తక్కువ ధరకు అరబిందో ఫార్మా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించారని కెవి రావు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. విచారణకు హాజరు కావాలంటే సూచించింది. కానీ రకరకాల కారణాలు చెబుతూ వారు విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పుడు ఏకంగా ఈడీ నోటీసులు రావడంతో ఎలా స్పందిస్తారో చూడాలి.
* విజయసాయి ఎదురుదాడి
అయితే కాకినాడ పోర్టు విషయంలో విజయసాయిరెడ్డి ఎదురుదాడికి దిగారు.తమకు ఏ పాపం తెలీదని చెప్పుకొచ్చారు. చిన్నపిల్లడైన విక్రాంత్ రెడ్డి ని ఇరికిస్తారా అంటూ ప్రశ్నించారు. కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కెవి రావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలోనే కాకినాడ పోర్టును కేవీ రావుకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా రాజకీయ కుట్రగా అభివర్ణించారు. దీనిని న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈడి నోటీసులతో ఈ కేసు విషయంలో సీరియస్ నెస్ పెరిగింది. మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.