Alluri Sitharama Raju District: ఆదివారం.. అర్ధరాత్రి సమయం 12:00 కావస్తోంది.. కరెంటు సరఫరా అంతంత మాత్రం గానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే చిమ్మ చీకటి.. గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎర్ర నీటితో సరికొత్తగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. పైగా తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో ఆమె కుటుంబ సభ్యులు దేవుడి మీద భారం వేసి, రోదించడం మొదలుపెట్టారు. ఇది సమయంలో ఆపద్బాంధవుల్లా వచ్చారు పోలీసులు, వైద్య సిబ్బంది. తమ ప్రాణాలకు తెగించి గర్భిణి, ఆమె కడుపులో ఉన్న పసిపాపను కాపాడారు.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురం మండలం గోదావరి పరివాహ ప్రాంతంగా ఉంటుంది. గతంలో ఈ మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్ళింది. జూలై – సెప్టెంబర్ మాసాలు వస్తే చాలు వర రామచంద్రపురం వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. వరద వల్ల బాహ్య ప్రపంచంతో వర రామచంద్ర పురానికి సంబంధాలు తెగిపోతాయి. ఈ క్రమంలో ఎవరైనా అనారోగ్యానికి గురైనా, ఇంకా ఏదైనా అనుకోని సంఘటన చోటు చేసుకున్నా అంతే సంగతులు. అందుకే ఈ మూడు నెలల పాటు ఈ మండలంలో ప్రభుత్వాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారు.
వర రామచంద్రపురం మండల కేంద్రానికి చెందిన ముత్యాల భవాని నిండు గర్భిణి. ఆదివారం ఆమె ప్రసవ వేదనతో తీవ్రంగా ఇబ్బంది పడింది. పైగా తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె భర్త సాయిరాం రేఖపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ప్రసవానికి ఆసుపత్రి వైద్యుడు అనిల్ కుమార్ ఏర్పాట్లు చేస్తుండగానే తీవ్రంగా రక్తస్రావం అయింది. దీంతో ఆమె ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని భావించి కోతులగుట్ట ఆసుపత్రికి తరలించాలని భావించారు. అయితే గోదారి వరదల వల్ల అక్కడికి వెళ్ళేందుకు రహదారి సదుపాయం సరిగా లేదు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వర రామచంద్రపురం తహసీల్దార్ మౌలానా ఫాసిల్, ఎటపాక సీఐ రామారావు కు సమాచారం అందించడంతో వారు వెంటనే ఆసుపత్రికి వచ్చారు. నాటు పడవను ఏర్పాటు చేసి, దానికి ఎన్ డి ఆర్ ఎఫ్ సభ్యులను తోడుగా పంపారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం తలెత్తుతుందని భావించి ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేంచారు. ఆ గర్భిణి ని తీసుకొని కూనవరం చేరారు. అక్కడి నుంచి సిఐ తన వాహనంలో కోతుల గుట్ట ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆమెకు పూర్తిస్థాయిలో వైద్యం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో సోమవారం ఉదయం ఆమెను ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది పడవలపై కొంత దూరం తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వాహనంలో మరికొంత దూరం తీసుకెళ్లారు. అనంతరం చింతూరు ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆస్పత్రి వైద్యుడు కోటిరెడ్డి శస్త్ర చికిత్స చేయడంతో భవాని పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
భవానిని సురక్షితంగా చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చి, తల్లి బిడ్డ ప్రాణాలు కాపాడిన సీఐ రామారావు, తహసీల్దార్ , ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జవహర్ భాషా అభినందించారు. అయితే భవాని ప్రాణానికి, ఆమె కడుపులో ఉన్న శిశువుకు ఏమాత్రం ఆపద వాటిల్లకుండా ఉండేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం మాములుది కాదు. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని.. ఆమెను చింతూరు ఆస్పత్రికి తీసుకెళ్లడంలో సీఐ, తహసీల్దార్ సఫలికృతులయ్యారు. తన భార్యకు పునర్జన్మ ప్రసాదించిన సీఐ, తహసీల్దార్ కు సాయిరాం కృతజ్ఞతలు తెలియజేశాడు.