Kerala Floods 2024: కేరళ : ప్రకృతి సౌంర్యానికి నిలయం దక్షిణ భారత దేశంలోని కేరళ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో కొబ్బరి చెట్లు.. నదులు.. కొండలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. దక్షిణ భారత దేశంలో ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే రాష్ట్రం కేరళనే. అయితే ఈ కేరళపై కొన్నేళ్లుగా ప్రకృతి కన్నెర్రజేస్తోంది. కరోనా సమయంలో దేశంలోనే తొలి కేసు కేరళలోనే నమోదైంది. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న కేరళ నుంచి లక్షల మంది వివిద దేశాల్లో స్థిరపడ్డారు. ఇక వైద్య రంగంలో ఎక్కువ మంది ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. అయినా ఇక్కడ వైరస్‌లు, వ్యాధులు విజృంభిస్తున్నాయి. కరోనా, బర్డ్‌ఫ్లూ, నిఫా ఇలా వరుస వైరస్‌లు కేరళవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక వైరస్‌లతోపాటు.. తాజాగా భారీ వర్షాలు, వరదలు కేరళను ముంచెత్తుతున్నాయి. వరదలకు వందల మంది మృత్యువాత పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం వచ్చిన వరదలు కేరళలో విళయం సృష్టించాయి. తాజాగా కేరళలో వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. వాయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో వందల మంది వాటికింద చిక్కుకుపోయారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటనల జరిగింది. దీంతో చాలా మంది నిత్రలోనే కొండచరియల కింద కూరుకుపోయారు. టీ ఎస్టేట్ కార్మికులు నివసించే ప్రాంతం కావడంతో చాలా మంది కూలీలు వాటికింద కూరుకుపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 44 మంది మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా శిథిలాల కింద వందల మంది ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వర్షాల ప్రభావంతోనే..
కేరళలోని పలు ఉత్తర జిల్లాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాల్లో తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. మలప్పురంలోని నిలంబూర్ ప్రాంతానికి ప్రవహించే చలియార్ నదిలో చాలా మంది కొట్టుకుపోతారని అనిపించిందని స్థానికులు భయంతో చెప్పారు. వాయనాడ్‌లోని మెప్పాడి పంచాయతీ పరిధిలోని ముండక్కై, చూరల్‌మల గ్రామాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి పెద్ద ప్రమాదం జరిగినట్టుగా వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కోయంబత్తూర్‌లోని సూలురు నుంచి రెండు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలిక్యాప్టర్లను వాయనాడ్‌కు పంపించింది. ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ రెండు బెటాలియన్లు కూడా కన్నూర్ నుంచి వాయనాడ్‌కు తరలి వెళ్లాయి. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కారŠప్స్ కు చెందిన రెండు బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
నాలుగ గంటల్లో మూడుసారు..
కొండలకు సమీపంలో ఇళ్లు దుకాణాలు ఉండడంతో కొండచరియలు విరిగిపడడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని భావిస్తున్నారు. మరోవైపు నాలుగు గంటల వ్యవధిలోనే కొండచరియలు మూడుసార్లు విరిగిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపుతున్నారు. దీంతో నష్టం ఎక్కువగా జరిగినట్లు పేర్కొంటున్నారు. ఘటనాస్థలికి వెళ్లే వంతెన వరదలకు కొట్టుకుపోవడంతో శిథిలాల కింద కూరుకుపోయినవారిని కాపాడడం కష్టతరంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ప్రధాని నరేంద్రమోదీ ఫన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. కేరళ ఎంపీలు రాజ్యసభలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. కేంద్రమంత్రులు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కేరళకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కొనసాగుతున్న సహాయ చర్యలు..
ప్రమాద స్థలంలో ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని సీఎం పినరయి విజయన్ తెలిపారు. కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయని, సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు వెళ్లారని చెప్పారు.