Prasanna Reddy Remarks: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తోంది. కూటమి ప్రభుత్వానికి కార్నర్ అవుతోంది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతి రెడ్డి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు.. ఆ సందర్భంగా జుగుప్సాకరంగా మాటలాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. అయితే అక్కడకు గంటల వ్యవధిలోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కనీసం ఇంటి ఆనవాళ్లు లేకుండా విధ్వంసం సృష్టించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందించే లోగా.. టిడిపి కూటమి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమర్థత స్పష్టంగా కనిపించింది.
ఖండించిన కూటమి నేతలు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, కూటమి నేతలు ఈ ఘటనపై స్పందించారు. ఓ మహిళ నేతపై ఇలానే మాట్లాడడమా అంటూ మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అటువంటి వారిని సభ్య సమాజంలో ఉంచకూడదు అని కూడా చెప్పారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఒక ముద్ర ఉంది. అనుచిత వ్యాఖ్యలు చేస్తారని.. మహిళల పట్ల చులకనగా వ్యవహరిస్తారని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నీచాతి నీచంగా మాట్లాడడంతో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతోంది.
Also Read:అన్నా, చంద్రన్నా..వినరా మాయన్నా.. ఇప్పుడు చంద్రబాబుపై ఈ పాటే ట్రెండింగ్!
ప్రజల్లోకి ఆయన వ్యాఖ్యలు..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలుగుదేశం కూటమి( TDP Alliance) నేతలు ఈ విషయంలో సమన్వయంగా ముందుకు సాగుతూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. జనసేన కు చెందిన ఓ మహిళ నేత ఈ ఘటనపై మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడమే కాదు.. ఆయనను బయటకు వచ్చి తన్నాలని పిలుపునిచ్చారు. మంత్రి వంగలపూడి అనిత అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలను వారి ఇళ్లల్లో మహిళలకు చూపించాలంటూ సూచించారు. ఆ మహిళలు ఏమీ అనకపోతే ఇక్కడితో ఈ వివాదాన్ని నిలిపివేస్తామని సవాల్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలకు మహిళలకు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మొత్తానికి అయితే ఈ వివాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కూటమి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫెయిల్ అయ్యింది. వైసిపి నేత నోటి నుంచి మురుగు మాటలు వస్తే.. టిడిపి నేతలు మాత్రం అంతకుమించి విధ్వంసం సృష్టించారు. కానీ ఈ విధ్వంసం కంటే.. ఆ మురుగు మాటలు ప్రమాదకరమని ప్రజలు భావించేలా టిడిపి కూటమి నేతలు వ్యవహరించారు. ఒక్క బాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసమర్థతను చాటి చెప్పారు.