Prajagalam: సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీతో చంద్రబాబు వేదిక పంచుకోనున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం వీరితో జత కలవనున్నారు. ఇందుకు చిలకలూరిపేట సమీపంలోని బోపూడి ‘ప్రజాగళం’ వేదిక కానుంది. ఎన్డీఏ లోకి తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో తెలుగుదేశం,జనసేన, బిజెపి మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయింది. అటు అభ్యర్థుల ఎంపిక సైతం ఒక కొలిక్కి వచ్చింది. ఈ తరుణంలో ఉమ్మడి ప్రచార సభ రేపు బోపూడిలో జరగనుంది.ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ సైతం పాల్గొనున్నారు.
300 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. అసాధారణ భద్రతతో పాటు ఆరు హెలిపాడ్స్ ను ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో సభా వేదికను నిర్మించారు. సభా వేదిక చుట్టూ ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ పూర్తి చేశారు. బైకులు, కార్లు కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. మూడు పార్టీల కీలక నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 60 అడుగుల వెడల్పు, 40 అడుగుల లోతుతో వేదిక నిర్మాణం జరిగింది. వేదిక పైకి పరిమిత స్థాయిలోనే నేతలను అనుమతించునున్నారు. వేదికపై 14అడుగుల భారీ ఎల్ఈడి డిస్ ప్లే ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ప్రజలు వీక్షించేందుకు మరో 14 భారీ ఎల్ఈడీ లను ఏర్పాటు చేశారు. అటు వేదిక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి ఆధీనంలో ఉంది. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశారు.
సభ నిర్వహణకు మూడు పార్టీల నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలకు లోకేష్ సమన్వయం చేస్తున్నారు. అటు భారీగా జన సమీకరణపై దృష్టి పెట్టారు. సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాని మోదీతో చంద్రబాబు వేదిక పంచుకోనుండడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అటు జన సైనికులు సైతం అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఇటు ఉభయ గోదావరి తో పాటు అటు కోస్తా,రాయలసీమ జిల్లాల నుంచి మూడు పార్టీల శ్రేణులు తరలివస్తున్నాయి. ఇప్పటికే సిద్ధం సభలతో వైసిపి ఆర్భాటం చేస్తుండగా.. ఇప్పుడు ఈ మూడు పార్టీల కలయికలో తొలి సభతో సవాల్ విసిరాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.