Vangaveeti Radhakrishna: ఏపీలో రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగిసింది. దాదాపు 62 పదవులను ప్రకటించారు. కూటమి పార్టీలోని మూడు పార్టీలకు ఛాన్స్ ఇచ్చారు. అత్యధికంగా టిడిపికి చెందిన వారే నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ అయ్యారు. అయితే ఆశావహులుగా ఉన్న చాలామందికి ఈసారి పదవులు దక్కలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమ,వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ వంటి వారి పేర్లు వినిపించలేదు. అయితే వారికి నామినేటెడ్ పదవుల కంటే ఎమ్మెల్సీలు గాను, రాజ్యసభ సభ్యుల గాను చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పోస్టులు అంటే వారి స్థాయికి తగిన విధంగా కావన్నదిఒక భావన.అయితే రెండో విడత ప్రకటించిన పదవుల విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు.మూడు పార్టీల్లో సీనియర్లకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ప్రకటించారు.అనూహ్యంగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సైతం సలహాదారు పదవిలో నియమించారు.సమాజానికి మంచి సంకేతాలు ఇచ్చారు. అయితే కొంతమంది నేతల విషయంలో మాత్రం మొండి చేయి చూపారు. వారికి వేరే ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అలా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా వంగవీటి రాధాకృష్ణ, పిఠాపురం వర్మ విషయంలో చంద్రబాబు వేరే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
* పిఠాపురం సీటు త్యాగం
ఈ ఎన్నికల్లో పిఠాపురం బరి నుంచి తప్పుకున్నారు వర్మ. తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన నియోజకవర్గం పిఠాపురం ఒకటి. కానీ పవన్ కోసం సీటు త్యాగం చేశారు వర్మ. తొలుత ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు నీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ అంటూ హామీ ఇవ్వడంతో పక్కకు తప్పుకున్నారు వర్మ. పవన్ గెలుపు కోసం కృషి చేశారు. భారీ మెజారిటీ తీసుకురాగలిగారు.ఇదే విషయాన్ని పవన్ సైతం చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.కానీ ఇటీవల జనసేన క్యాడర్ నుంచి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు వర్మ.ఈ క్రమంలో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని భావించారు.కానీ ఇంతవరకు ప్రకటించలేదు.ఇప్పుడు రెండు విడతల నామినేటెడ్ పోస్టుల ప్రకటన రావడంతో.. అందులో వర్మ పేరు లేకపోవడంతో కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తారని తెలుస్తోంది.
* వంగవీటి వారసుడికి అవకాశం
వంగవీటి రాధాకృష్ణకు సైతం ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ హామీతో టిడిపిలో చేరారు రాధా.కానీ అప్పుడు పార్టీ ఓడిపోయింది.గత ఐదేళ్లుగా టిడిపిలోనే కొనసాగారు. ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి గెలవడంతో రాధాకృష్ణకు మంచి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. కానీ నామినేటెడ్ పోస్టుల జాబితాలో రాధాకృష్ణ పేరు లేదు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న రాధాను ఇటీవల మంత్రి లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు మాటగా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లు సమాచారం.మరోవైపు ఎమ్మెల్సీ పదవుల కోసం దేవినేని ఉమా బుద్ధ వెంకన్న, పరిటాల శ్రీరామ్ వంటి నేతలు సైతం ఆశలు పెట్టుకున్నారు. విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆ ఇద్దరికీ ఎలా ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.