Vangaveeti And Varma: ఏపీలో నామినేటెడ్ పోస్టుల కదలిక ఏర్పడింది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. మిగతా పదవులను సైతం భర్తీ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి నేతలకు టిడిపి హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో వారిద్దరూ చంద్రబాబుతో పాటు లోకేష్ ను కలిశారు. అయితే వారిద్దరికీ నామినేటెడ్ పదవులు కేటాయించనున్నారని.. అందుకే పిలిచి మాట్లాడారన్న ప్రచారం సాగుతోంది. అయితే అలా కలిసిన నేతలు నామినేటెడ్ పదవులు ఆశించడం లేదు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవులను ఆశిస్తున్నారు. అయితే ఉన్నఫలంగా వారిని పిలిపించి మాట్లాడడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. త్వరలో వారికి పదవులు తప్పవని ప్రచారం సాగుతోంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
* రాధా తో లోకేష్ కీలక చర్చలు..
రెండు రోజుల కిందట మంత్రి నారా లోకేష్ ను కలిశారు వంగవీటి రాధాకృష్ణ. సుమారు గంటపాటు చర్చించారు. 11 నెలల అనంతరం లోకేష్ ను వంగవీటి రాధా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాదులో ఉంటున్న రాధాను ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి మాట్లాడుకున్నారు లోకేష్. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు రాధాకృష్ణ. ఆ ఎన్నికల్లో టికెట్ లభించకపోయినా టిడిపి కోసం ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పటికీ రాధాకృష్ణ మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ రాలేదు. అయినా సరే టిడిపి తో పాటు కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఇంతవరకు రాధాకు ఎటువంటి పదవి దక్కలేదు. తాజాగా కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. కానీ అంతకంటే పెద్ద పదవి రాధా కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే వీలైనంత త్వరగా పదవి ఇచ్చే బాధ్యత తనది అంటూ లోకేష్ రాధాకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
* వర్మ కు గన్మెన్ల కేటాయింపు..
మరోవైపు సీఎం చంద్రబాబును పిఠాపురం టిడిపి ఇన్చార్జ్ వర్మ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసి చాలా అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ కోసం టికెట్ వదులుకున్నారు వర్మ. ఆయన గెలుపు కోసం పనిచేశారు. అయితే వర్మ త్యాగానికి ఏం చేసినా పర్వాలేదని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీగా ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్న ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. కనీసం నామినేటెడ్ పదవి కేటాయించలేదు. దీంతో వర్మ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం నడిచింది. అయితే చంద్రబాబు ఆయనను పిలిపించి మాట్లాడడం మాత్రం కొత్త చర్చకు దారితీస్తోంది. అయితే తనకు రక్షణ కల్పించాలని కోరగా.. వర్మకు ప్రత్యేకంగా ఇద్దరు గన్మెన్లను కేటాయించింది పోలీస్ శాఖ. తద్వారా త్వరలో వర్మకు పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. అయితే టిడిపి వర్గాలు మాత్రం రాధాకృష్ణకు రాజ్యసభ, చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. టిడిపి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.