Posani Krishna Murali : నటుడు పోసాని కృష్ణమురళి( Posani Krishna Murali) అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విపరీతమైన విమర్శలు చేసేవారు పోసాని కృష్ణమురళి. వీటిపై కూటమి ప్రభుత్వం రాగానే ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. అయితే ఉన్నపలంగా రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు పోసాని కృష్ణ మురళి ప్రకటించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని.. రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. అయితే పోసాని కృష్ణ మురళిని కూటమి ప్రభుత్వం క్షమించినట్టేనని అంతా ప్రచారం నడిచింది. అయితే ఒక్కసారిగా అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని నిన్న హైదరాబాదులో అరెస్టు చేశారు పోలీసులు. ఈరోజు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. పోసాని కృష్ణ మురళి అరెస్టును ఖండించారు.
* పోసాని భార్యకు ధైర్యం చెప్పిన జగన్
అయితే పోసాని కృష్ణ మురళి తనకు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీతో సంబంధం లేదని కొద్ది నెలల కిందట ప్రకటించారు. అయితే తాజాగా పోసాని అరెస్టు నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అరెస్టును ఖండించారు. హైదరాబాదులో ఉన్న భార్య పోసాని కుసుమలతకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఇస్తుందని.. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరపున న్యాయపరంగా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు జగన్మోహన్ రెడ్డి ఆమెకు తెలిపారు.
Also Read : పోసాని వర్సెస్ ఏపీ పోలీసులు.. అరెస్టుకు ముందు మై హోమ్ భుజ లో ఏం జరిగిందంటే?
* సీనియర్ నేతలతో సమావేశం
పోసాని కృష్ణ మురళి అరెస్ట్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) వైసీపీ సీనియర్ నేతలతో చర్చించినట్లు సమాచారం. టిడిపిలో జీవి రెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే.. పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగినట్లు జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడినట్లు సమాచారం. ఈరోజు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోసానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత.. కోర్టులో హాజరు పరుస్తారని తెలుస్తోంది. అందుకే అక్కడి న్యాయస్థానానికి వైసిపి లీగల్ సెల్ బృందాన్ని పంపించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు.
* ఆ సామాజిక వర్గం టార్గెట్
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సామాజిక వర్గం( caste )పైనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో కమ్మ సామాజిక వర్గం పైనే చంద్రబాబు దృష్టి పెట్టారని.. ఆ సామాజిక వర్గంలో తాను, తన కుమారుడు మాత్రమే ఉండాలన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరోసారి అదే సామాజిక వర్గానికి చెందిన పోసాని కృష్ణ మురళి అరెస్టుతో.. ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారన్న ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకునేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : వంశీ కేసులో జగన్మోహన్ రెడ్డి.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు