Posani Krishna Murali: ఇటీవల వల్లభనేని వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు.. అదే రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ లో ప్రముఖ సినీ నటుడు, వైసిపి సానుభూతిపరుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణ మురళి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టిడిపి నాయకులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన ఓబులవారి పల్లె పోలీసులు నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయారు. రాయదుర్గం ప్రాంతంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ సందర్భంగా పోసానికి, పోలీసులకు వాగ్వాదం జరిగింది. చివరికి పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేసి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో వైసీపీ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ పోసాని కృష్ణమురళి తరఫున వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. దీంతో కృష్ణ మురళిని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణమురళి అనేక సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. నాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేయడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని.. తాను చేసిన వ్యాఖ్యలను వైరల్ చేసింది రామకృష్ణ రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ అని కృష్ణ మురళి పోలీసుల ఎదుట తెలిపినట్టు సమాచారం.
ముందస్తు బెయిల్ పిటిషన్
పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్టు సమాచారం.. తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని.. తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని.. రాజకీయ కక్షతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తమకు ముందస్తుగా బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తామని రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో అదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ పేర్కొన్నారు. మరోవైపు సజాల రామకృష్ణారెడ్డి, భార్గవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై టిడిపి నాయకులు స్పందిస్తున్నారు. ఎటువంటి తప్పు చేయనప్పుడు.. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారని.. అడ్డగోలుగా విమర్శలు చేశారని.. ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదని టిడిపి నేతలు అంటున్నారు. మొత్తానికి సజ్జల భార్గవ్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
Also Read: ఏపీలో ఆ మూడు పథకాలపై సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు