Posani: పోసాని కృష్ణ మురళి గురించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో ఉన్నారు. చంద్రబాబు, పవన్ లపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో తన విమర్శల డోసును పెంచారు. వైసిపికి అనుకూలంగా టీవీ డిబేట్లకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి ఉన్న సినీ గ్లామర్ కూడా ఆయనే. గత ఎన్నికల మాదిరిగా మోహన్ బాబు, అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వచ్చే ఛాన్స్ లేదు. అయితే ఫిలిం ఛాంబర్ కు సంబంధించిన నామినేటెడ్ పోస్టులో ఉన్న పోసాని కృష్ణ మురళి మాత్రం వైసిపికి ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. టీవీ డిబేట్లో సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తనకు సినిమాలకు లోటు లేదని, సినీ పరిశ్రమ అంటే మెగా కుటుంబమే కాదని తేల్చి చెప్పారు.
గబ్బర్ సింగ్ సినిమా నాడు పవన్ కళ్యాణ్ తో ఎదురైన పరిణామాలను గురించి వివరించే ప్రయత్నం చేశారు. సాధారణంగా సినిమా షూటింగ్ కోసం తాను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తానని పోసాని తెలిపారు. అయితే గబ్బర్ సింగ్ దర్శకుడు విన్నపం మేరకు ఉదయం ఏడు నుంచి రాత్రి 9 గంటల వరకు టైం ఇచ్చినట్లు చెప్పారు. ఓ రోజు షూటింగ్ కు హాజరైతే పవన్ రాలేదని.. అందుకే ఇంటికెళ్లిపోయినట్లు తెలిపారు. ఇంట్లో భోజనం చేస్తుండగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారని.. ఆ సమయంలో చెప్పు పవన్ అంటూ అడిగానని.. మేం పిచ్చోళ్ళమా షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని పోసాని చెప్పుకొచ్చారు. ఆరోజు తన భార్యకు ఆపరేషన్ జరిగిందని.. ఈ విషయం దర్శకుడు కూడా చెప్పానని పోసాని తెలిపారు. ఆ సమయంలోనే పవన్ కు ఇచ్చి పడేశానని చెప్పుకొచ్చారు. నువ్వు హీరో అయితే ఏంటి అని గట్టిగానే రియాక్ట్ అయినట్లు తెలిపారు.
సినిమాల్లో చాన్సులు తగ్గాయన్న అంశంపై చర్చించే క్రమంలో పోసాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో రాజకీయపరంగా విభేదించినప్పుడు తన సినిమాలు ఏవి తగ్గలేదని చెప్పే క్రమంలో పవన్ ఈ అనుచిత కామెంట్స్ చేశారు. తెలుగు పరిశ్రమ మొత్తం మెగా ఫ్యామిలీ వెంట ఉంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ బాబు కుమారుడు ఎలా గెలిచారని పోసాని ప్రశ్నించారు. మెగా ఫ్యామిలీ పవర్ఫుల్ అయితే చిరంజీవి రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోయారని నిలదీసినంత పని చేశారు. తనకు సినిమాలో అవకాశాలు రాకుండా చేస్తే వెంట్రుక కూడా పీకలేరని ఘాటుగా పోసాని రియాక్ట్ కావడం విశేషం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ డం ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ తరహా వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదని.. బయట రాజకీయాల్లో ఉన్న నేతలు ఉన్నతంగా ఉంటున్నారని.. కానీ చిత్ర పరిశ్రమకు చెందిన పోసాని తీరు సరిలేదని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం చిత్ర పరిశ్రమ నుంచి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిలో పోసాని ఒక్కరే ఉండడంతో ఆయన తీరు వివాదాస్పదమవుతోంది.