Real Hero: ఈ కానిస్టేబుల్ సాహసానికి సెల్యూట్ కొట్టాల్సిందే

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో కసుకుర్తి భాస్కర్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నారు. రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆ కుటుంబం హాజరైంది.

Written By: Dharma, Updated On : February 19, 2024 12:48 pm
Follow us on

Real Hero: ప్రమాదాలు ఎలా జరుగుతాయో తెలియదు. ఏ రూపంలో ఎదురవుతాయో తెలియదు. ఇలా జరిగే అకాస్మాత్తు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటారు. సరైన సమయంలో కాపాడగలిగితే ఎంతోమంది ప్రాణాలు నిలుస్తాయి. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కాపాడాలి అని ఆలోచన రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ క్రమంలో తమ ప్రాణానికి ప్రమాదం అని తెలిస్తే కాపాడేందుకు ఎవ్వరూ సాహసించరు. చాలా తక్కువ మంది మాత్రమే అటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా అటువంటి సాహసమే చేశాడు ఓ కానిస్టేబుల్. కాల్వలో పడిన కారులోని ఏడుగురు వ్యక్తులను కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ సాహసానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో కసుకుర్తి భాస్కర్ అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నారు. రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమానికి ఆ కుటుంబం హాజరైంది. తిరుగు ప్రయాణంలో భాగంగా పి.గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీ కొట్టింది. అదే వేగంతో సమీపంలోని పంట కాలువలోకి దూసుకెళ్లింది. కాలువలో నీరు ఉండడంతో కారు మునిగిపోయింది.

అదే మార్గంలో బైక్ పై వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నెల్లి శ్రీనివాస్ కారును గమనించారు. వెంటనే స్పందించారు. కాలువలోకి దూకి కారు వద్దకు చేరుకున్నారు. కానీ డోర్లు చాలాసేపు తెరుచుకోలేదు. తీవ్ర ప్రయత్నం చేయడంతో అవి ఓపెన్ అయ్యాయి. కారులో ఉన్న భాస్కర సుధీర్ కుమార్, ఆయన భార్య సింధు, పిల్లలు భాను, జయాన్స్, తల్లి పార్వతి, అత్త బిక్కిన సూర్యకాంతం, మామ సుబ్బారాయుడును బయటకు తీసుకొచ్చారు. వారికి సఫర్యలు చేయడంతో తేరుకున్నారు. ఏ ఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఓ కుటుంబాన్ని రక్షించడంతో అందరి అభిమానాన్ని అందుకుంటున్నారు.