AP Police : వైసీపీ సర్కారు చర్యలతో పోలీస్ శాఖ మూల్యం చెల్లించుకుంటోంది. అస్తవ్యస్థ విధానాలతో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలతో పోలీస్ శాఖపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విపక్షాలు, ప్రజాసంఘాలపై పోలీసులను ఉసిగొల్పుతోంది. ప్రశ్నించేవారిని గొంతునొక్కుతోంది. ప్రమోషన్లకు ఆశపడి కొందరు, ప్రభుత్వ ప్రాపకానికి మరికొందరు అధికారులు దాసోహమవుతున్నారు. ఆ ప్రభావం కిందిస్థాయిలో కనిపిస్తోంది. ఏళ్లతరబడి కోరుతున్నా బదిలీ చేయడం లేదంటూ ఓ హెడ్ కానిస్టేబుల్ సీఎం కాన్వాయ్ కు ఎదురెళ్లగా.. అదే సీఎం బందోబస్తుకు హాజరైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు వదిలాడు.
అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ సర్కారు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతి నిర్వీర్యం చేసి.. రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఇంటి స్థలాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 26న సీఎం జగన్ చేతులమీదుగా పట్టాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం టూర్ బందోబస్తుకుగాను రాష్ట్రం నలుమూలల నుంచి పోలీసులు హాజరయ్యారు. ఇలా హాజరైన కానిస్టేబుల్ పవన్ కుమార్ పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ని మంగళవారం వేకువజామున పాము కరిచింది. వెంటనే గమనించి పామును చంపేసి.. కానిస్టేబుల్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ కుమార్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో పవన్ కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పేదల ఇళ్ల స్థలాల దగ్గర అభివృద్ధి పనుల బందోబస్తుకు తోటి సిబ్బందితో కలిసి వచ్చారు. రాత్రి సమయంలో కూడా పోలీసులు గ్రామాల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు భోజనాలు ముగించుకున్నారు. ఆ తర్వాత అనంతవరం లే అవుట్ దగ్గర కొండ దగ్గర ఆలయంలో మెట్ల ముందు ఉన్న గచ్చుపై పడుకున్నారు. పాముకాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పవన్ కుమార్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా సీఎం జగన్ అమరావతిలో అడుగుపెడుతున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పటికే రైతులు ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా రాష్ట్రం నలుమూలల నుంచి పోలీసులను రప్పించారు. కానీ వారికి తగిన వసతులు కల్పించలేదు. అక్కడ పోలీసులు నడి రోడ్డుపై చాలా ప్రమాదకరంగా రాత్రి పగలు తేడా లేకుండా కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కుమార్ పాముకాటుకు గురై మృత్యువాత పడ్డాడు. కానీ ఇంతవరకూ వైసీపీ సర్కారు స్పందించలేదు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ హత్యగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరీ ఇంత అమానవీయమా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కుమార్ మృతికి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.