New Parliament Building Inauguration
New Parliament Building Inauguration: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని సిద్ధమైంది. అత్యాధునిక హంగులతో ఈ పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. దూర దృష్టితో, భారతీయ నిర్మాణ కౌశలాన్ని ఇందుకు జోడించారు. మే 28 అంటే ఆదివారం నాడు ఈ పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోనుంది. ప్రస్తుత వృత్తాకార పాత భవనం పక్కన స్వదేశీ ఆలోచనలతో త్రికోణాకారంలో సుమారు 1200 కోట్లకు పైగా వేయంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ఈ పార్లమెంటు నూతన భవనం రూపుదిద్దుకుంది. ఈ కొత్త భవంతి, రాజ్ పథ్ ఆధునికీకరణ, ప్రధానమంత్రికి కొత్త నివాసం, కొత్త కార్యాలయం, రాష్ట్రపతికి కొత్త కార్యాలయం వంటివి ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.
కొత్తది ఎందుకు నిర్మించారంటే
ప్రస్తుత పార్లమెంట్ భవనానికి 1921లో శంకుస్థాపన చేశారు. అప్పుడు భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలిస్తున్నారు కాబట్టి వారి ఆలోచనలకు అనుగుణంగా 1927లో దాన్ని పూర్తి చేశారు. బ్రిటిష్ హయాంలో దానిని కౌన్సిల్ హౌస్ గా పిలిచేవారు. ఇందులోనే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కొలువుదీరేది. స్వతంత్రం అనంతరం 1956లో ప్రస్తుత భవనానికి రెండు అంతస్తులు అదనంగా కలిపారు. కాలానుగుణంగా అప్పటికి ఇప్పటికి అవసరాలు పెరిగాయి. స్థలపరంగా కూడా చాలా ఇరుకుగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే సమావేశాలకే ఇబ్బందికరంగా ఉంది. ఉభయ సభలు సంయుక్త సమావేశానికి సెంట్రల్ హాల్ ఉన్నప్పటికీ, అందులో 436 మంది మాత్రమే కూర్చోవచ్చు. సంయుక్త సమావేశం నిర్వహించినప్పుడల్లా దాదాపు 200 కుర్చీలు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా పార్లమెంట్ నిర్మించి 100 సంవత్సరాలకు సమీపిస్తుండడంతో ఈ భవంతిలో ఆడియో, వీడియో, సీసీటీవీలు, శీతలీకరణ వాటి కోసం ఎప్పటికప్పుడు అదనంగా ఏర్పాట్లు చేయాల్సి వస్తుండడంతో భవనం పటిష్టత దెబ్బతింటున్నది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పుడు సీట్లు పెరుగుతాయి. దీనికోసం ప్రస్తుత పార్లమెంట్ భవనం ఏమాత్రం సరిపోదు. వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త భవన నిర్మాణానికి సంకల్పించింది.
ఇవీ విశేషాలు
ఈ ప్రాజెక్టును టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నిర్మించింది. 9,482 క్యూబిక్ మీటర్ల ప్లై యాష్ ను ఉపయోగించింది. 20,97,931 పని గంటల్లో ఈ భవనాన్ని పూర్తి చేసింది. 63,506 మెట్రిక్ టన్నుల సిమెంట్ వినియోగించారు. సుమారు 60,000 మంది కార్మికులు పనిచేశారు. 25,730 టన్నుల స్టీల్ ఉపయోగించారు. 150 సంవత్సరాలకు పైగా డోకా లేకుండా ఉండేలా కట్టిన ఈ నిర్మాణం జోన్_5 స్థాయి భూకంపాలు కూడా తట్టుకోగలుగుతుంది.
గతంలో ఇలా
కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్ 10న ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీనిని నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. 16 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 64,500 మీటర్ల వైశాల్యంలో దీనిని ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంటు భవనానికి రెండు సంవత్సరాల ఐదు నెలల 18 రోజుల సమయం పట్టింది. లోక్ సభలో 888 మందికి సరిపడా సీట్లు, రాజ్యసభలో 384 మందికి సరిపడా సీట్లు ఏర్పాటు చేశారు. ఇక ఖర్చు విషయానికొస్తే ప్రాథమికంగా 862 కోట్లు అనుకున్నారు.. పూర్తయ్యేసరికి ఖర్చు 1200 కోట్లకు చేరుకుంది. ఇక నిర్మాణాన్ని అహ్మదాబాద్ కు చెందిన హెచ్ సి పి డిజైనర్ జమాల్ పటేల్ రూపొందించారు.. ఇక పాత పార్లమెంట్ భవనం లాగా ఇందులో సెంట్రల్ హాల్ లాంటిది కట్టలేదు. ఉభయ సభల సంయుక్త సమావేశాలకు వాడుకుంటారు. 888 సీట్లు ఉన్న లోక్సభ హాల్లో 1272 సీట్లకు పెంచుకునే వెసలు బాటు ఉంది. ఇక సభ్యులు ఓటింగ్ కు వీలుగా సీట్లలో బయోమెట్రిక్, డిజిటల్ అనువాద పరికరాలు, మార్చుకోగల మైక్రో ఫోన్లు అమర్చారు. ప్రతి సభ్యుడు సీటు వద్ద మల్టీమీడియా డిస్ప్లే సదుపాయం ఉంటుంది. సామాన్యులు గ్యాలరీల్లో ఎక్కడ కూర్చొని చూసిన స్పష్టంగా కనిపించే విధంగా సీట్లు ఏర్పాటు చేశారు. మీడియాకు ప్రత్యేక ఆధునిక ఏర్పాట్లు చేశారు. మొత్తం 530 సీట్లను మీడియాకు కేటాయించారు. పార్లమెంట్ భవనం చుట్టూ పచ్చదనానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. క్రోటాన్ మొక్కల నుంచి ఎత్తైన అశోక మొక్కల వరకు విరివిగా నాటారు. కొన్ని చోట్ల మియావాకి విధానంలో మొక్కలు నాటారు. సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని నివారించేందుకు పార్లమెంటు లోపల, బయట ఏర్పాట్లు చేశారు.
పాత భవనం ఇలా
పాత పార్లమెంటుకు అప్పటి బ్రిటిష్ సర్కార్ హయాంలో 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. ఇది ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఐదు సంవత్సరాల 11 నెలల ఆరు రోజుల్లో పాత పార్లమెంటును నిర్మించారు. ఆ రోజుల్లో దీనికి 83 లక్షలు ఖర్చు చేశారు. లోక్సభలో 582 సీట్లు, రాజ్యసభలో 250 సీట్లు కేటాయించారు. ఈ పాత భవనాన్ని ఎడ్విన్ లుట్యేన్, హెర్బర్డ్ బేకర్ రూపొందించారు.