https://oktelugu.com/

Vallabhaneni Vamsi Arrest  : గన్నవరంలో చిక్కిన వల్లభనేని వంశీ..వెంటాడి పట్టుకున్న పోలీసులు?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం మూడు బృందాలు హైదరాబాద్ వెళ్ళగా.. వంశీ మాత్రం స్థానికంగానే పట్టుబట్టడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 2, 2024 / 07:15 PM IST
    Follow us on

    Vallabhaneni Vamsi Arrest : ఏపీలో కీలక రాజకీయ పరిణామం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల నడుమ ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లరి మూకలు దాడి చేసి నిప్పు పెట్టాయి. వైసీపీ శ్రేణులే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయని టిడిపి ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తిరిగి టిడిపి శ్రేణులపైనే అప్పట్లో కేసులు నమోదయ్యాయి. కనీసం ఈ కేసులో వైసీపీ నేతలను అరెస్టు కూడా చేయలేదు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో అటువైపు చూసేందుకు కూడా పోలీస్ అధికారులు సాహసించలేదు. ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్ అమెరికా వెళ్లిపోయారు. సరిగ్గా కౌంటింగ్ ముందు గన్నవరం చేరుకున్నారు. ఓటమి ఎదురైన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన హైదరాబాదులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా జిల్లాకు కొత్త ఎస్పీ రావడంతో టిడిపి కార్యాలయం పై దాడి కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో వల్లభనేని వంశీ 71 నిందితుడిగా ఉన్నారు.ఇప్పటికే 18 మందిని అరెస్టు చేశారు. వంశీ ఈ దాడిలో పాల్గొనక పోయిన తెర వెనుక ప్రోత్సాహం అందించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు.. హైదరాబాద్ కు మూడు పోలీస్ బృందాలు వెళ్లాయి.అయితే అక్కడ ఆయన ఆచూకీ లభించకపోవడంతో.. వంశీ విదేశాలకు, ముఖ్యంగా అమెరికా వెళ్ళిపోయారని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు తిరుగు ముఖం పట్టినట్లు కూడా ప్రచారం జరిగింది.

    * గన్నవరంలోనే ఉన్నారా?
    అయితే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు కంటపడ్డారని..వెంటనే వారుఅప్రమత్త మైనట్లు తెలుస్తోంది. వాహనాల్లో వెంబడించగా వంశీ తన ఇంటి వద్ద పట్టుబడినట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని పోలీసులు ఇంతవరకు ధృవీకరించలేదు.

    * 18 మంది అరెస్ట్
    ఇప్పటికే టిడిపి కార్యాలయం పై దాడి ఘటనకు సంబంధించి 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో వంశీ ప్రధాన అనుచరుడు యూసఫ్ పఠాన్ ఉన్నారు. గత నెల 9న గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు ఎంపీపీ నగేష్ తో సహా 15 మందిని, తరువాత మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వంశీ తో పాటు మిగతావారు పరారీలో ఉన్నారు. వీరి కోసం స్థానికంగా గాలించినా ఆచూకీ లేకుండా పోయింది. పార్టీ కార్యక్రమాలకు సైతం వంశీ హాజరు కావడం లేదు. గన్నవరం లో వైసీపీ కార్యాలయాలు కూడా తెరుచుకోవడం లేదు. వైసీపీ శ్రేణులు దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి.

    * కూటమి ప్రభుత్వం టార్గెట్
    వైసిపి అధికారంలో ఉన్నప్పుడు అనుకూల పోలీస్ అధికారులు గన్నవరంలో విధులు నిర్వహించేవారు. దీంతో వల్లభనేని వంశీకి అడ్డే లేకుండా పోయింది. గతంలో వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టిడిపి కూటమి ప్రభుత్వానికి ఆయన టార్గెట్ అయ్యారు. ఇది తెలుసుకునే వంశీ జాగ్రత్త పడ్డారని..అమెరికా పారిపోయారని ప్రచారం జరిగింది. కానీ ఆయన స్థానికంగానే ఉన్నట్లు తాజాగా తెలిసింది. పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై పోలీస్ శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు.ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టివిషయాలను వెల్లడించే అవకాశం ఉంది.