Telugu News » Andhra Pradesh » Police arrest cid additional sp vijay pal for torturing raghuramakrishnam raju
Raghuramakrishnam Raju : రఘురామను హింసించిన అధికారి అరెస్ట్.. తదుపరి వారిపైనే?
వైసిపి హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో ఇబ్బంది పెట్టిన అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.
Raghuramakrishnam Raju : ఏపీలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది పై కేసులు నమోదయ్యాయి. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై రాజ ద్రోహం కేసు పెట్టారు. కస్టడీలోకి తీసుకొని చిత్రహింసలు పెట్టినట్లు రఘురామకృష్ణం రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే రఘురామకృష్ణం రాజు పార్టీ మారారు. ఎమ్మెల్యే తో పాటు డిప్యూటీ స్పీకర్ అయ్యారు.అప్పట్లో తనపై కస్టడీలో జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. అప్పట్లో రఘురామకృష్ణంరాజును అరెస్టు చేసి.. హింసించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి అదనపు ఎస్పి విజయ్ పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు పిలవడంతో ఆయన ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. దీంతో అదుపులోకి తీసుకున్నారు. 2019లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. గెలిచిన కొద్ది రోజులకే పార్టీలో రెబెల్ గా మారారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీంతో ఏపీప్రభుత్వం ఆయన పై రాజ ద్రోహం కేసు పెట్టింది.
* విచారణ పేరిట థర్డ్ డిగ్రీ
నాడు హైదరాబాదులో ఉన్న రఘురామకృష్ణంరాజును అరెస్టు చేశారు సిఐడి అధికారులు. గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. విచారణ పేరిట థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణం రాజు. చివరకు కోర్టు ఆదేశాల మేరకు ఆయనను విడిచిపెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సిఐడి ఏసిపి విజయ్ పాల్ కీలకపాత్ర పోషించినట్లు రఘురామకృష్ణం రాజు ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో రఘురాం కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్ పాల్ ను చివరకు అరెస్టు చేశారు.
* జగన్ ఆదేశాలతోనే
అప్పటి ప్రభుత్వ అధినేత జగన్ ఆదేశాల మేరకు సిఐడి అధికారులు రఘురామకృష్ణంరాజును హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, సునీల్ కుమార్ పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు విజయ్ పాల్ ను మాత్రమే విచారించారు. ఆ ఐపీఎస్ ల జోలికి వెళ్లలేదు. దీంతో తాజాగా విజయపాల్ విచారణలో ఏ అంశాలను వెల్లడించాడు. తదుపరి అరెస్టులు ఉంటాయా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.