Vijayawada traffic diversions: దేవి నవరాత్రులు.. అంటే ముందుగా గుర్తొచ్చేది విజయవాడ నగరం( Vijayawada city). దుర్గమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. అక్టోబర్ 3 వరకు జరుగుతాయి. అదే సమయంలో విజయవాడ ఉత్సవ్ కూడా నిర్వహిస్తున్నారు. వాహనాలతో పాటు జనం రద్దీ కూడా ఉంటుంది నగరంలో. ఇటువంటి తరుణంలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ మళ్లింపులు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వాహనాలు నల్లకుంట దగ్గర రూట్ మార్చుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈరోజు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ మళ్లింపు కొనసాగుతుంది. ప్రజలు కూడా సహకరించాలని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కోరారు. దేవి శరన్నవరాత్రులతో పాటు విజయవాడ ఉత్సవ్ నకు సహకరించాలని కోరారు.
* హైదరాబాదు నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనదారులు.. నల్ల గుంట దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా చిన్న అవుటపల్లి, హనుమాన్ జంక్షన్ వైపుగా వెళ్లాలి. అటు విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చే వారు సైతం ఇదే మార్గంలో రావాలని పోలీసులు సూచిస్తున్నారు.
* హైదరాబాద్ వైపు నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలు విషయానికి వస్తే.. నల్లకుంట దగ్గర వెస్ట్ బైపాస్ ఎక్కి చిన్న అవుటపల్లి, వ్యాసరపల్లి మీదుగా వెళ్ళాలి. తెలుగు ప్రయాణం కూడా ఇదే మార్గం గుండా సూచించారు పోలీసులు.
* హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు, చెన్నై వైపు వెళ్లే వాహనాల విషయంలో.. నార్కెట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి
* చెన్నై వైపు నుంచి విశాఖ వెళ్లే వాహనాలు.. విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు ఒంగోలు, త్రావ గుంట, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
* ప్రత్యేక పార్కింగ్..
విజయవాడలో రద్దీ దృష్ట్యా పోలీసులు పార్కింగ్ ప్రదేశాలను కట్టుదిట్టం చేశారు. భవానిపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కుమ్మరపాలెంలోని టీటీడీ పార్కింగ్, పున్నమి ఘాట్, ఎంవి రావు ఖాళీ స్థలం, భవాని ఘాట్, సెంట్రల్ వేర్ హౌస్ గ్రౌండ్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ పార్కింగ్, సుబ్బారాయుడు పార్కింగ్, భవానిపురం లారీ స్టాండ్, సితార సెంటర్, సోమా గ్రౌండ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, గొల్లపూడి పంట కాలువ రోడ్డులో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.