Polavaram Project: పోలవరం ఏపీ ప్రజల చిరకాల స్వప్నం. వృధాగా పోతున్న గోదావరి జలాలను ఒడిసి పట్టాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఫలితంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర తాగు, సాగునీటి అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 1941లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించినా.. 2005 వరకు ఏ ఒక్క సీఎం కూడా కన్నెత్తి చూడలేదు. కనీసం ప్రారంభించేందుకు సాహసించలేదు. 2005లో తొలిసారిగా పోలవరం పనులు ప్రారంభించారు నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి. కుడి ఎడమ కాలువలలో అధిక భాగం పనులు చేయించారు. జలాశయానికి అవసరమైన భూమిని సేకరించగలిగారు. ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే క్రమంలోనే ఆ మహానేత అకాల మృతి చెందారు. దీంతో పోలవరం పై నీలి నీడలు కమ్ముకున్నాయి.
2014లో పోలవరం ప్రాజెక్టుపై కదలిక వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 100% విజయాన్ని తామే భరించి పూర్తి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు పనులు చేపట్టేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది.అయితే 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. అయితే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న చంద్రబాబు కోరిక మేరకు 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే తాము చెల్లిస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అయితే ఇదే అదునుగా చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.1481 కోట్లకు పెంచింది. అయితే నాడు కమిషన్లకు కక్కుర్తి పడి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ ని అడ్డం పెట్టుకొని పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. గోదావరి వరదలు మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాపర్ డ్యాంల పనులను పూర్తి చేయకుండానే.. 2017 నవంబర్లో ఈసీఆర్ఎఫ్ డాం గ్యాప్ 2 లో 1396 మీటర్ల పొడవున పునాది డయాఫ్రమ్ వాల్ పనులు చేపట్టారు. 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 2018 నవంబర్లో 35 మీటర్ల కాన్పూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపర్ డ్యాములను ప్రారంభించారు. అయితే అప్పటివరకు 72 శాతం పనులు జరిగాయి అన్నది టిడిపి వర్గాలు చెబుతున్న మాట.
అయితే 2019 మే 30న ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు నుంచి పున సమీక్ష పేరిట పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేశారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరదలు ప్రారంభమయ్యాయి.డయా ఫ్రమ్ వాల్ దారుణంగా దెబ్బతింది. అయితే ఈ విషయంలో తప్పిదం మీదంటే మీది అంటూ అటూ అధికార వైసిపి, ఇటు విపక్ష టీడీపీల మధ్య ఆరోపణల పర్వం కొనసాగింది.2014-19 మధ్య 72 శాతం పనులు జరిగినట్లు టిడిపి చెబుతోంది. 2019 తర్వాత జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు చేస్తోంది. అయితే ఎప్పటి వరకు పోలవరం పనులు కేవలం 49 శాతం మాత్రమే పూర్తయ్యాయని వైసీపీ చెబుతోంది.2005 నుంచి 2019 మధ్య 24.85 శాతం జరగగా.. మిగతా 24.94% వైసిపి హయాంలో పూర్తయ్యాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
టిడిపి అధికారంలోకి రావడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై రగడ ప్రారంభమైంది. తప్పంతా జగన్ దేనని ఆరోపిస్తూ చంద్రబాబు స్వేతపత్రం విడుదల చేశారు. అయితే దీనిపై వైసీపీ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. కేవలం తప్పులు కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిర్మాణం చేపడతామంటే.. ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తోంది. కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని.. కేంద్రమే నిర్మించి ఉంటే ఈపాటికి పనులు పూర్తయ్యేవని.. పోలవరం నిర్మాణ జాప్యం అంత చంద్రబాబు చేసిన పాపం పుణ్యమేనని వైసిపి ఆరోపిస్తోంది. మొత్తానికైతే పోలవరం ప్రాజెక్టు ఇష్యూ ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది. ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.