AP Pensions: టిడిపి నేతలతోనే పింఛన్ల పంపిణీ.. కీలక ఆదేశాలు

ఇప్పటివరకు నెలకు పింఛన్ మూడు వేల రూపాయలు మాత్రమే అందుతోంది. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ నాలుగు వేలు అందించేందుకు చంద్రబాబు నిర్ణయించారు.

Written By: Dharma, Updated On : June 29, 2024 1:40 pm

AP Pensions

Follow us on

AP Pensions: ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ అందించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. అయితే వాటన్నింటికీ చెక్ చెబుతూ చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి పెరిగిన పింఛన్ మొత్తం తో కలిపి.. ఈ నెల నుంచి పెరిగిన 4000 పింఛన్ మొత్తాన్ని జూలై 1న అందించేందుకు నిర్ణయించింది.వాలంటీర్లను పక్కన పెట్టింది. సచివాలయ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించింది.

అయితే ఇప్పటివరకు నెలకు పింఛన్ మూడు వేల రూపాయలు మాత్రమే అందుతోంది. ఒకేసారి 1000 రూపాయలు పెంచుతూ నాలుగు వేలు అందించేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నికలకు ముందు ఈ మేరకు హామీ ఇచ్చారు. పింఛన్ మొత్తాన్ని నాలుగువేల రూపాయలకు పెంచడంతో పాటు ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో ప్రాధాన్యత అంశంగా పింఛన్ల పెంపు ఫైల్ పైనే సంతకం చేశారు. ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచడంతో లబ్ధిదారులు కూడా ఆనందంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు.

జూలై 1న జరిగే పెన్షన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలని టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. మండల, పట్టణ, డివిజన్, గ్రామస్థాయి, వార్డు, క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్చార్జిలతో పాటు టిడిపి నాయకులు విధిగా సచివాలయ ఉద్యోగి వెంట వెళ్లి పింఛన్ అందించాలని సూచించారు. పింఛన్ల పంపిణీ ని ఒక వేడుకగా జరపాలని కూడా పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తో పాటు పార్లమెంట్ అధ్యక్షులు, పార్టీ ఇన్చార్జిలు కనీసం 10 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించి మీడియా, సోషల్ మీడియాలో వచ్చేటట్లు చూడాలని సూచించినట్లు సమాచారం. వీలైనంతవరకు తొలి రోజు పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు ఇవ్వడం విశేషం.

Tags