MLA Chirri Balaraju: పాపం జనసేన ఎమ్మెల్యే.. కారు కూడా లేదు.. డబ్బులు పోగేసి కొనిచ్చిన కార్యకర్తలు.. వైరల్ వీడియో

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సన్న కారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరాటం రాంబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు.

Written By: Dharma, Updated On : July 3, 2024 9:41 am

MLA Chirri Balaraju

Follow us on

MLA Chirri Balaraju: సామాన్య గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఆ వ్యక్తి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా.. మొక్కవోని దీక్షతో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు.ప్రజల మద్దతు కూడగట్టారు. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే కనీసం నియోజకవర్గంలో తిరగడానికి ఆయన దగ్గర వాహనం అంటూ లేదు. దీంతో పార్టీ కార్యకర్తలే తలో మొత్తం పోగుచేసుకుని కారు కొనుగోలు చేశారు. తమ అభిమాన ఎమ్మెల్యేకు గిఫ్ట్ గా అందించారు. వినడానికి వింతగా ఉంది కదూ. ఇది నిజం.

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సన్న కారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరాటం రాంబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో జనసేన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే నియోజకవర్గంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోలవరం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. పవన్ కళ్యాణ్ మరోసారి బాలరాజుకు టికెట్ కేటాయించారు. మూడు పార్టీల మద్దతుతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు బాలరాజు. అయితే బాలరాజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇప్పటికీ రేకుల షెడ్ లోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు సొంత వాహనం అంటూ లేదు.

ఎన్నికల ప్రచారంలో అద్దె వాహనాలతోనే కాలం గడిపారు.ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా సొంత వాహనం అవసరం. మారుమూల ఏజెన్సీ గ్రామాలను సందర్శించడానికి కారు కచ్చితంగా ఉండాల్సిందే. ఆయన పరిస్థితిని గమనించిన సీనియర్ నేత కరాటం రాంబాబు, బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు ఒక నిర్ణయానికి వచ్చారు. కొంత మొత్తం డబ్బులతో డౌన్ పేమెంట్ చేసి ఫార్చునర్ కారు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బులను ఎమ్మెల్యే జీవితంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే కోసం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన ఈ మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు. జనసైనికుల తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.