Prajagalam Sabha: ఏపీలో కూటమి దూకుడు పెంచింది. నిన్న చిలకలూరిపేటలో తొలి సంయుక్త ఎన్నికల ప్రచార సభ జరిగింది. ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కీలక ప్రసంగం చేశారు. దీంతో మూడు పార్టీల్లో జోష్ నెలకొంది. అయితే ప్రధాని మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు కారణమవుతోంది. చంద్రబాబు, పవన్ ల వ్యూహాలకు వ్యతిరేకంగా ప్రసంగం సాగినట్లు ప్రచారం సాగుతోంది. కనీసం చంద్రబాబు పేరు కానీ.. పవన్ ప్రస్తావన లేకుండా ప్రధాని ప్రసంగం జరగడం.. టిడిపి, జనసేన శ్రేణులకు మింగుడు పడని విషయంగా మారింది.
వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం వేదికగా భారతరత్న అవార్డును ఎన్టీఆర్ కు ప్రకటిస్తారని టాక్ నడిచింది. కానీ అలా జరగలేదు. నిన్నటి సభలో సైతం రాష్ట్రానికి ఎటువంటి హామీలు ప్రధాని ఇవ్వలేదు. అమరావతి గురించి అసలు ఎత్తలేదు. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఊసే లేకుండా పోయింది.రాష్ట్ర విభజన హామీలపై ప్రధాని మోదీ ప్రత్యేక ప్రకటన చేస్తారని టిడిపి,జనసేన వర్గాలు భావించాయి. కానీ ప్రధాని మోదీ నోటి వెంబడి ఒక్క హామీ కూడా రాలేదు.
మరోవైపు వైసిపి, కాంగ్రెస్ ఒక్కటేనని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని మోడీ ఆరోపించారు. అయితే షర్మిల చేస్తున్న వ్యాఖ్యలతో జగన్ కు డ్యామేజ్ జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తూ వచ్చారు. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అటు పవన్ సైతం షర్మిల విషయంలో సానుభూతితో వ్యవహరిస్తూ వచ్చారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈ అంశంలో మోడీ, చంద్రబాబు,పవన్ ల మధ్య సమన్వయం కొరవడినట్లు స్పష్టం అవుతోంది. ఓకింత అనుమానాలకు కారణమవుతోంది.