PM Modi is set to visit Rayalaseema : ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీని గద్దె దించి టిడిపి అధికారంలోకి వచ్చింది. బిజెపితో పాటు జనసేనతో కూటమి కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చేసింది. అంటే బిజెపికి వైసీపీ వ్యతిరేకమే కదా. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్రంలోని బిజెపికి అన్ని విధాలా సహకారం అందుతోంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ ఏకపక్షంగా మద్దతు తెలిపింది. అటు తరువాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం జై కొట్టింది. జీఎస్టీ పన్నుల తగ్గింపును స్వాగతించింది. చాలా బిల్లులకు ఏకపక్షంగా మద్దతు తెలిపింది. మొన్నటికీ మొన్న ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని గొప్పగా కొనియాడారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇవన్నీ తనపై ఉన్న కేసుల దృష్ట్యా తోనేనని జగన్మోహన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. అయితే జగన్ ఇంతలా బిజెపి కోసం ఆరాటపడుతుంటే.. బిజెపి నుంచి కౌంటర్ ప్రారంభం కానుంది అన్న టాక్ వినిపిస్తోంది.
* జగన్ ప్రస్తావన లేకుండా..
ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీని కేవలం టిడిపి టార్గెట్ చేసుకుంది. అప్పుడప్పుడు జనసేన సైతం గట్టిగానే విమర్శలు చేస్తోంది. బిజెపి నుంచి మాత్రం ఆ తరహా విమర్శలు లేవు. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. వివిధ సందర్భాల్లో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. కానీ ఎన్నడు జగన్మోహన్ రెడ్డిని నేరుగా విమర్శలు చేయలేదు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సమయంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పల్లెత్తు మాట అనలేదు. మొన్న విశాఖకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా మాత్రం నేరుగా విమర్శలు చేశారు. రాష్ట్ర బిజెపి నాయకులు జగన్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రాయలసీమ వస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడుతారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది.
* 16న ప్రధాని రాక..
ఈనెల 16న రాయలసీమకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). ఆ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. రాయలసీమ అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రాంతం. 2024 ఎన్నికల్లో తప్పించి అన్నింటా వైసిపి ఘనవిజయం సాధించింది. ఈసారి మాత్రం కూటమి ఘనవిజయం సాధించింది. అదే పట్టును కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ సైతం రాయలసీమ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అదే సమయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సైతం రాయలసీమ నుంచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రాయలసీమలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* జగన్ పై విమర్శలు తప్పవా?
ఇటీవల జీఎస్టీ( GST) తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిఎస్టి 2.0 విజయోత్సవ సభను ఏపీలో నిర్వహించాలని భావించారు. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా రాయలసీమలోని నంద్యాలలో ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. సహజంగానే రాయలసీమ ప్రాంతం కావడంతో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం జగన్ పై విమర్శలు చేస్తారు. జాతీయ కార్యక్రమం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడతారు. అందులో భాగంగా జగన్ పై కూడా విమర్శలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీలో కూటమికి బిజెపి మరింత ప్రోత్సాహం అందించినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.