Botsa Satyanarayana Political Troubles: కొంతమంది నేతలు రాజకీయాలను శాసిస్తుంటారు. కొన్ని కుటుంబాలు జిల్లాలను దశాబ్దాలుగా తమ కను సన్నల్లో పాలిస్తుంటాయి. ఫలానా నేత ఫలానా ప్రాంతానికి సామంత రాజు అన్నట్టు ప్రజలు కూడా భావిస్తుంటారు. ఈ లెక్కన విజయనగరం జిల్లాకు బొత్స సత్యనారాయణ సామంత రాజు అని చెప్పవచ్చు. రాజులకు ఎదురొడ్డి ఆయన రాజకీయం చేశారు. జిల్లాను శాసించారు. రాజును కాదని తానే రాజు అన్నట్టు వ్యవహరించారు. అయితే ఎంతటి నాయకుడైనా ఏదో ఒక రోజు గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ది అదే పరిస్థితి. ఏ జిల్లాలో మకుటం లేని మహారాజుగా ఎదిగారో.. అదే జిల్లాలో ఇప్పుడు భయపడుతున్నారు బొత్స. చుట్టూ మంది మార్బలం ఇప్పటికీ కొనసాగుతున్నా.. తనను అంతం చేసేందుకు జిల్లాలో కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బొత్స నుంచి ఈ మాట రావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
* రాజుల ప్రాబల్యం..
విజయనగరం జిల్లా( Vijayanagaram district ) రాజకీయాలు పూసపాటి రాజవంశీయుల చేతిలో ఉండేవి. విజయనగరం ఆవిర్భావానికి ముందు శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. అయితే జిల్లా అవతరించిన తరువాత విజయనగరం రాజులు రాజకీయ ప్రాబల్యం పెంచుకుంటూ వచ్చారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో అశోక్ గజపతిరాజు శకం ప్రారంభం అయిన తర్వాత ఆయనదే పెత్తనం. అటువంటి సమయంలో కాంగ్రెస్ తరపున రాజకీయాలు చేసేవారు పెనుమత్స సాంబశివరాజు. ఆయన శిష్యరికంలో రాజకీయాల్లో చేరారు బొత్స సత్యనారాయణ. యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి.. 1992లో తొలిసారిగా విజయనగరం డిసిసిబి చైర్మన్గా ఎన్నికయ్యారు. 1999 వరకు అదే పదవిలో కొనసాగుతూ.. బొబ్బిలి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో.. కేవలం ఐదు చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో బొత్స సత్యనారాయణ ఒకరు కావడం విశేషం. అది మొదలు జిల్లా రాజకీయాలపై తన పట్టు పెంచుకున్నారు బొత్స సత్యనారాయణ.
* రాజశేఖర్ రెడ్డి వద్ద గుర్తింపు..
2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ( Y S Rajasekhara Reddy )సీనియర్ నేతగా ఉన్న పెనుమత్స సాంబశివరాజును కాదని.. బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే అదునుగా తన ఫ్యామిలీని రంగంలోకి దించారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా తన మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీ అధికారంలో రాకపోయినా తన మాట చెల్లుబాటు అయ్యేలా పెద్దమనిషి పాత్ర పోషించడం బొత్సకు అచ్చొచ్చిన విద్య. కానీ 2024 ఎన్నికల్లో ఆ కుటుంబం అంతా ఓడిపోయింది. బొత్స రాజకీయ ప్రత్యర్థి అశోక్ గజపతిరాజు గవర్నర్ బంగ్లా లోకి వెళ్లిపోయారు. లోకేష్ విజయనగరం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం ప్రారంభించారు. తద్వారా బొత్స రాజకీయ పాచికలు పారడం లేదు. అందుకే అడుగడుగునా ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయి. రాజకీయంగా ఇబ్బందులు ప్రారంభం అయ్యాయి. నిస్సహాయతతో తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల అమ్మవారి వేడుకల్లో భాగంగా సిరిమాను తిలకించే అవకాశం డిసిసిబి కల్పించలేదు. పైగా ఓ వేదిక వద్ద కూర్చొని ఉండగా.. అది పడిపోయింది. బొత్సకు ప్రమాదం తప్పింది. తనకు జరిగిన అవమానాన్ని ఈ ప్రమాదం ద్వారా.. తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం ప్రజల్లోకి పంపించారు బొత్స. అయితే అయ్యో బొత్స అన్న వారు ఉన్నారు. మీరేం తక్కువ కాదు అన్నవారు ఉన్నారు. మొత్తం ఎపిసోడ్లో విజయనగరం జిల్లాలో బొత్స హవా తగ్గిందన్నది మాత్రం స్పష్టమవుతోంది.