PM Modi AP Visit: ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం. 2024 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఏపీకి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మంజూరు చేస్తూ వస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణం, ఇంకోవైపు పోలవరం.. ఇలా అన్నింటికీ సహకారం అందిస్తూ వస్తోంది. విశాఖ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అక్కడ లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. తాజాగా రక్షణ రంగంలో కూడా కీలక అడుగులు పడుతూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానకొండలో బీడీఎల్ రూ.1200 కోట్ల పెట్టుబడితో భారీ స్థాయిలో సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెలెంట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనకు వస్తున్న క్రమంలోనే ఈ కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించడం విశేషం.
బీడీఎల్ ఆయుధ వ్యవస్థ..
ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) ఈనెల 16న ఏపీలో పర్యటించనున్నారు. శ్రీశైలం ఆలయ సందర్శనతో పాటుగా జీఎస్టీ ర్యాలీలో ప్రధాని పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రకాశం జిల్లా దానకొండలో ప్రతిష్టాత్మక సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సమీకృత ఆయుధవ్యవస్థను ఏర్పాటు చేయనుంది. 1200 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కానుంది. మొదటి దశలో రూ.650 కోట్లను, రెండో దశలో రూ.550 కోట్లను వెచ్చించనుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రక్షణ పరికరాల తయారీలో దేశవ్యాప్తంగా రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా, వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి దక్కనుంది.
విజయనగరం జిల్లాలో ఆయుధ డిపో..
మరోవైపు నావికి సంబంధించి ఆయుధ డిపో ఏర్పాటు విజయనగరం జిల్లాలో( Vijayanagaram district ) జరగనుంది. బాడంగిలో ఈ ఆయుధం డిపో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బ్రిటీష్ హయాంలో బాడంగి మండలంలో ఒక చిన్న కార్గో విమానాశ్రయం ఉండేది. కాలక్రమంలో ఈ విమానాశ్రయం కనుమరుగయింది. అక్కడ భూములు రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. తూర్పు కోస్తా నౌక కేంద్రం విశాఖగా నడుస్తోంది. అదే సమయంలో భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నావి ఆయుధం డిపోను బాడంగిలో ఏర్పాటు చేసేందుకు.. కేంద్ర నావికాదళం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడంతో భూసేకరణకు యంత్రాంగం సిద్ధపడింది. అయితే రక్షణ రంగానికి సంబంధించి కీలక ప్రాజెక్టులు వస్తుండడం శుభపరిణామం.