PM Awas Yojana: ఏపీలో( Andhra Pradesh) పేద ప్రజలకు సొంత ఇంటి కలను నెరవేర్చనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటితోపాటు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలం అందించేందుకు సర్వే చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతోంది. రేపటితో గడువు ముగియనుంది. వాస్తవానికి నవంబర్ 30తో గడువు ముగిసింది. కానీ మరో రెండు వారాలపాటు పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వరకు దరఖాస్తులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. సచివాలయ ఉద్యోగులు ఈ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వివరాలు నమోదు చేస్తున్నారు.
– ఈ పథకం ద్వారా అర్హత పొందిన వారికి ఉపాధితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 1.59 లక్షల ఆర్థిక సహాయం అందనుంది.
– గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్రం నుంచి రూ.1.5 లక్షల సాయం అందుతుంది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష కలిపి.. మొత్తం రూ. 2.50 లక్షల సహాయం అందుతుంది.
– గతంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేవారు. కానీ ఈసారి గ్రామీణ ప్రాంతాలకు సైతం దీనిని విస్తరించారు.
– రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఆవాస్ ప్లస్ 2024 యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల ముఖాన్ని చూసి.. వేలిముద్రలు తీసుకుని వివరాలను నమోదు చేస్తున్నారు.
– ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. అక్కడ నుంచి మంజూరు జరిగితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
– సొంత స్థలం ఉన్నవారు స్థలంతో పాటు తమ వివరాలను ఆ స్థలం ఉన్నచోటే నమోదు చేయించుకుంటున్నారు.
– రేపే చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు నమోదయ్యే అవకాశం ఉంది.