Pithapuram Varma
Pithapuram Varma : ఈ ఎన్నికల్లో ఏపీలో మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు త్యాగాలు చేశారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు పిఠాపురం వర్మ. పిఠాపురంలో దాదాపు తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయం. ఆ పార్టీకి సంస్థాగతంగా బలం కూడా ఎక్కువ. పైగా అక్కడ వర్మ కు చాలా పట్టు ఉంది. గతంలో ఇండిపెండెంట్ గా గెలుపొందిన చరిత్ర ఆయనది. అటువంటి చోట 2024 ఎన్నికలకు పూర్తి ప్రణాళికతో ఉండేవారు వర్మ. కానీ పవన్ కళ్యాణ్ వచ్చి తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. దీంతో వర్మను సముదాయించారు చంద్రబాబు. ఇప్పుడు సీటు త్యాగం చేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఎమ్మెల్సీ నీవేనంటూ బాబు ఆయనకు హామీ ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ పదవులు వస్తున్నాయి.. భర్తీ అవుతున్నాయి కానీ వర్మ కు మాత్రం న్యాయం జరగడం లేదు. వర్మతో పాటు త్యాగం చేసిన వారందరికీ పదవులు దక్కడం విశేషం.
* గత ఐదేళ్లుగా కష్టపడి
గత ఐదు సంవత్సరాలుగా పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించారు వర్మ. వైసిపి హయాంలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అదే సమయంలో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్నారు తంగేళ్ల శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ రాకతో తంగేళ్ల శ్రీనివాస్ కాకినాడ ఎంపీ అభ్యర్థి అయ్యారు. అయితే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేయాలనుకున్న సానా సతీష్ ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా మారిపోయారు. కానీ వారందరికీ పదవులు దక్కినా.. వర్మ త్యాగానికి తగ్గట్టు మాత్రం ఇంతవరకు పదవి దక్కకపోవడం అనుచరులకు మనోవేదనకు గురిచేస్తుంది.
* నాగబాబు కు బంపర్ ఆఫర్
మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు నాగబాబు. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎలమంచిలిలో నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి కేటాయించాల్సి వచ్చింది. దీంతో ఆ సీటును త్యాగం చేశారు నాగబాబు. నాగబాబు నాడు చేసిన త్యాగానికి ఫలితంగా నేడు రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక గోల్డెన్ ఛాన్స్. అయితే ఇలా త్యాగం చేసిన వారందరికీ పదవులు దక్కుతున్నాయి. కానీ పిఠాపురం వర్మ విషయంలో మాత్రం ఎటువంటి న్యాయం దక్కలేదు. అలా త్యాగం చేసిన వ్యక్తిగా ఉండి పోవాల్సి వస్తుందేమోనన్న బెంగ వర్మను వెంటాడుతోంది. మరి ఆయన ఆవేదనను విని చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.