Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan ) పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. సొంత నియోజకవర్గం పిఠాపురం పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. తద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో తన పట్టు మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను జనసేన కంచుకోటలుగా మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురంలో శాశ్వత నిర్మాణానికి సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నాయి. 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం జరగగా.. పార్టీ కార్యాలయం మూడు ఎకరాల విస్తీర్ణంలో భవనాలు నిర్మిస్తుండడం విశేషం. మరోవైపు పిఠాపురంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. టెంపుల్ టూరిజం ను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. 20 కోట్ల రూపాయలు నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది.
శక్తి పీఠాల అభివృద్ధి..
పిఠాపురంలో( Pithapuram) ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా శక్తిపీఠంగా భావించే.. శ్రీ పురూహూతిక అమ్మవారు, ముక్కుటేశ్వర స్వామి ఆలయం, శ్రీపాద శ్రీ వల్లభ పీఠం వంటి ఆలయాలు సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇటీవల భక్తుల తాకిడి కూడా పెరిగింది. అయితే ఇటువంటి ఆలయాలు నియోజకవర్గంలో 19 వరకు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలని సంకల్పించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రభుత్వాన్ని ఒప్పించి దేవాదాయ శాఖ ద్వారా 20 కోట్ల రూపాయలు విడుదల చేయించారు. దేవాదాయ శాఖ సిజిఎఫ్ నిధులు మంజూరు చేయగా.. మ్యాచింగ్ గ్రాంట్ తో ఆలయాల జీర్ణోద్దారణ పనులు జరగనున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దీంతో నిధుల విడుదలకు మార్గం ఏర్పడింది.
ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా..
పిఠాపురం ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలని పవన్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పిఠాపురం నియోజకవర్గానికి ప్రముఖుల తాకిడి కూడా పెరిగింది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. పిఠాపురంలో శాశ్విత ఇంటి నిర్మాణం జరుగుతుండడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగిపోయాయి. చాలామంది భూములు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల పునరుద్ధరణ జరగనుండడంతో.. పిఠాపురం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
శాశ్వత నియోజకవర్గంగా..
పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వతంగా మార్చుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్మోహన్ రెడ్డికి పులివెందుల, నందమూరి బాలకృష్ణ కు హిందూపురం, లోకేష్ కు మంగళగిరి మాదిరిగానే పవన్ కళ్యాణ్ సైతం పిఠాపురంలో శాశ్విత ప్రాతిపదికన పనులు చేస్తుండడం విశేషం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో చాలావరకు మార్పులు సంతరించుకున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆధ్యాత్మిక పర్యాటక రంగాల్లో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.