Panchayat vs Parishad explained: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇదే ఉత్సాహంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. నవంబర్ 24వ తేదీలోపు కోర్టుకు స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు సమర్పించాల్సి ఉంది. దీంతో సోమవారం(నవంబర్ 17న) నిర్వహించే కేబినెట్ సమావేశంలో తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం మొదట ప్రజాప్రతినిధి స్థాయిలో గ్రామ స్థాయిని బలోపేతం చేయడానికి పంచాయతీ ఎన్నికలనే ప్రాధాన్యంగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పరిషత్ ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
పరిషత్ ఎన్నికలు వాయిదా
ఇంతకుముందు ప్రభుత్వం రెండు విడతల్లో ఎంసీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. కానీ కోర్టులో కొనసాగుతున్న కేసులు, ఎన్నికల ప్రక్రియపై వచ్చిన న్యాయసవాళ్ల నిర్వహణలో ఆటంకం కలిగించాయి. మరోవైపు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోవడంతో జిల్లా పరిషత్‌లపై ఆర్థిక ప్రవాహం దెబ్బతింది. ఈ నేపథ్యంలో నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయడమే సముచితమని యోచిస్తున్నట్లు తెలిసింది.
కేబినెట్‌లో కీలక నిర్ణయం..
సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇస్తే, గ్రామీణ పాలనలో నూతన శక్తి స్ఫూర్తి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గ్రామ స్థాయి ఎన్నికల ద్వారా స్థానిక నాయకత్వం బలపడుతుందని భావిస్తున్నారు. పరిషత్ స్థాయిలో ఉన్న నిధుల కొరత సమస్యను ఎదుర్కొవడానికి ప్రభుత్వం ముందు పంచాయతీలు కొలువుదీరాలని, వాటి ద్వారా ప్రాథమిక సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రయత్నిస్తోంది.
ఎన్నికల క్రమం మారిస్తే రాజకీయంగా కూడా ప్రభావం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు ముందుగా జరగడం వల్ల గ్రామస్థాయిలో పార్టీ బలపడం, స్థానిక ప్రజాభిప్రాయానికి మద్దతు ఇచ్చినట్లు అవుతుంది.