Chandrababu Naidu next move: ప్రజలకు విద్య, వైద్యం సమృద్ధిగా… ఉచితంగా అందిస్తే చాలు ప్రజలకు బహుళ ప్రయోజనాలు కల్పించినట్టే. ఒక సాధారణ కుటుంబం విద్య తో పాటు వైద్యానికే తమ సంపాదన ఖర్చు చేస్తోంది. వాటినే ఉచితంగా అందించగలిగితే మాత్రం ప్రజల ఆదాయ మార్గాలను పెంపొందించినట్టే. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఉచితంగా నాణ్యమైన వైద్యం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యా బోధన.. ఆపై భవిష్యత్తు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులను అందిస్తే సత్ఫలితాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ వైద్యం అంటేనే ఒక రకమైన అపవాదు ఉంది. ప్రభుత్వ విద్య పట్ల విముఖత ఉంది. ఆ రెండింటిని రూపుమాపగలిగితే రాష్ట్రాలతో పాటు ఈ దేశం కూడా అభివృద్ధి సాధిస్తుంది. అయితే ఏపీలో పాఠశాల స్థాయిలో విద్య అస్తవ్యస్తంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
కనిపించని ప్రభుత్వ పాఠశాలలు..
సాధారణంగా ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల( government school) ఉండేది. ఒకటి నుంచి ఐదు తరగతులు కొనసాగేవి. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. కానీ విద్యాసంస్కరణల పేరిట సరికొత్త అంశాలు తెరపైకి రావడం.. అదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు పెరగడం.. ప్రజల్లో ఆదాయం వనరులు పెరగడం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మందగించడం.. ప్రైవేటు పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తుండడంతో క్రమేపి సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు ప్రైవేటు విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో విద్యా సంస్కరణల పేరుతో.. అనుత్పాదక వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రాథమిక పాఠశాలల మూత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సగానికి సగం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మూతపడ్డాయి. ఉన్న వాటిని సమీప పాఠశాలల్లో విలీనం చేయించి.. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి.. చేతులు దులుపుకుంది ప్రభుత్వం. అయితే ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వైపే అందరి వేళ్ళు చూపిస్తున్నాయి.
అసంబద్ధంగా పాఠశాలల విలీనం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పాఠశాలల స్వరూపాన్ని మార్చారు. పాఠశాలలకు అదనపు సదుపాయాలను కల్పించారు. ఆపై తరగతి గదుల్లో మౌలిక వసతులను పెంచారు. అవన్నీ అభినందించదగ్గవే. కానీ ఒక్కసారిగా పాఠశాలలతో పాటు తరగతులను విలీనం పేరిట సర్దుబాటు చేశారు. తక్కువ విద్యార్థులు ఉన్నారని చెప్పి పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలలకు పంపించారు. దీంతో వేలకోట్ల రూపాయల పెట్టుబడులు వృధా అయ్యాయి. కేవలం ప్రచారం కోసమే అన్నట్టు మిగిలాయి.
పారిశ్రామికవేత్తల సూచన..
ఏపీలో( Andhra Pradesh) ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. పెద్ద ఎత్తున పరిశ్రమలతో పాటు దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయి. అదే ఉత్సాహంతో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహించింది కూటమి ప్రభుత్వం. అయితే కొందరు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో విద్యాశాఖ పరిస్థితిని తెలుసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందించగలిగితే అందరి ఆదాయం వనరులు పెరుగుతాయని.. తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని.. అప్పుడే పరిశ్రమల ఏర్పాటుకు తగిన ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత.. మంత్రి నారా లోకేష్ చొరవతో విద్య శాఖలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు విశాఖ పెట్టుబడుల సదస్సులో స్వయంగా పారిశ్రామికవేత్తలు ఈ ప్రస్తావన తీసుకురావడం విశేషం. తద్వారా విద్యా శాఖలో మార్పులకు ఒక అవకాశం కలగనుందన్నమాట. విశాఖపట్నం సదస్సు వేదికగా పారిశ్రామికవేత్తల నుంచి ఈ మాట రావడంతో.. ప్రభుత్వం సైతం ఆలోచించే అవకాశం ఉంది.