Andhra University : ఆంధ్రా యూనివర్సిటీలో అమ్మకానికి పీహెచ్ డీలు

సత్యనారాయణ మీడియా ముందుకొచ్చి ఏయూలో జరుగుతున్న తతంగాన్ని వెల్లడించారు. ఆరోపణలు చేస్తున్నమహిళ భర్త యూనివర్శిటీలో మద్యం వ్యాపారం చేస్తారట. ఆయనకు అర్హత లేకపోయినా ఓ ఉద్యోగం కల్పించారని అంటున్నారు. ఆయన పీహెచ్‌డీలు అమ్మి పెట్టే వ్యాపారం చేస్తున్నారని… ఇలా ఒకటి కాదు, రెండు కాదు 1400 పీహెచ్‌డీలు అమ్మకానికి ఉన్నాయని సత్యనారాయణ చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : July 19, 2023 3:00 pm
Follow us on

Andhra University : ఆంధ్రా యూనివర్సిటీ…దేశంలోనే తొలి తెలుగు భాషాప్రాతిపదికన ఏర్పాటై ఘనమైన చరిత్ర, నేపథ్యం సొంతం చేసుకున్న విశ్వవిద్యాలయం.  ఎన్నో లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగం, ఉపాధి మార్గాలను చూపించిన సరస్వతి నిలయం. ఎంతో మంది మహోన్నత వ్యక్తులు వైస్ చాన్సులర్లుగా వ్యవహరించి పదవులకు ఔన్నత్యం చాటిచెప్పారు. ప్రముఖ కవి, నాయకుడు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి తొలి వైస్ చాన్సులర్ గా వ్యవహరించారు. అటు తరువాత డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ వీసీగా బాధ్యతలు తీసుకొని ఏయూ ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేశారు. రాధాక్రిష్ణన్ భారత ఉప రాష్ట్రపతిగా ఎంపిక కావడంతో మరోసారి వీసీగా కట్టమంచి రామలింగారెడ్డి నియమితులయ్యారు. సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ పనిచేసిన వీసీలంతా యూనివర్సిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేశారు. కానీ గత మూడేళ్లుగా వీసీగా ఉన్న ప్రసాదరెడ్డి మాత్రం అందుకు అతీతం.
తాజాగా ఏయూలో మద్యం, పీహెచ్ డీల విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. సత్యనారాయణ అనే హిందీ ప్రోఫెసర్ తనకు హీహెచ్‌డీ రాకుండా చేస్తున్నారని.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఓ మహిళ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయటకు రావడంతో సత్యనారాయణ మీడియా ముందుకొచ్చి ఏయూలో జరుగుతున్న తతంగాన్ని వెల్లడించారు. ఆరోపణలు చేస్తున్నమహిళ భర్త యూనివర్శిటీలో మద్యం వ్యాపారం చేస్తారట. ఆయనకు అర్హత లేకపోయినా ఓ ఉద్యోగం కల్పించారని అంటున్నారు. ఆయన పీహెచ్‌డీలు అమ్మి పెట్టే వ్యాపారం చేస్తున్నారని… ఇలా ఒకటి కాదు, రెండు కాదు 1400 పీహెచ్‌డీలు అమ్మకానికి ఉన్నాయని సత్యనారాయణ చెబుతున్నారు. తాను టాపిక్ అవ్వకపోయినా ఆయన భార్య.. హీహెచ్‌డీ చేసేసినట్లుగా సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తే.. పెట్టనందుకే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారని సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వీసీగా ప్రసాదరెడ్డి ఆంధ్రా యూనివర్సటీలో ఎంట్రీ ఇచ్చారు. ఆయన అసలు సిసలు వైసీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. చివరకు గ్రేటర్ విశాఖ మునిసిపల్ ఎన్నికలు, మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి సలహాదారుడిగా మారిపోయాయన్న ఆరోపణలున్నాయి. వైఎస్‌ రాజశేఖర రెడ్డి, జగన్‌, విజయసాయి రెడ్డి, వైఎస్‌ విజయలక్ష్మి పుట్టిన రోజులకు కేకులు కోసి సంబరాలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే.. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన వర్సిటీని స్వయంగా వైస్‌ చాన్స్‌లరే వైసీపీ కార్యాలయంగా మార్చేశారు.అన్ని విలువలూ వదిలేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే… బరితెగించి వ్యవహరించారు. ఎలాంటి ఆంధ్రా యూనివర్సిటీని ఇలా తయారు చేశారే అని మాజీ ఉప వీసీలు,  పూర్వ విద్యార్థులు విస్తుపోయేలా వ్యవహరించారు. రానున్న రోజుల్లో ఏయూ వేదికగా ఎన్ని నేరాలు, ఘోరాలు వెలుగుచూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.