Homeఆంధ్రప్రదేశ్‌పవన్ ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు.. నాదెండ్ల మనోహర్

పవన్ ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగత విమర్శలు.. నాదెండ్ల మనోహర్

రాజకీయంగా, భావజాలంపరంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక వ్యక్తిగతంగా విమర్మించాలనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతో మొత్తం సినిమా పరిశ్రమనే ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.  శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వ్యక్తులు… రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఏం మాట్లాడారు? ఏ విషయాలపై ప్రస్తావించారనే అంశాలను మరోసారి ఇంటికెళ్లి ఆ వీడియో చూడాలని సూచించారు. బుధవారం మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రారంభోపన్యాసం చేశారు. జనసేన అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఈ సమావేశంలో ముందుగా గులాబ్ తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడం గురించి మాత్రమే మాట్లాడారు. అజ్ఞానంతో మూసుకుపోయిన పాలకుల కళ్లు తెరిపించారు. సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే – పరిశ్రమను నమ్ముకొని ఉన్న లక్షలాది మంది కార్మికులను కాపాడమని.  ఏ రోజూ కూడా  శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్కరిని కూడా తనతో సినిమా చేయమనో, బ్లాక్ టికెట్లు అమ్ముకోమనో, కోట్లు కావాలనో అడగలేదు. అసలు డబ్బుకు విలువిచ్చే వ్యక్తే కాదు ఆయన.

  • వర్గాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొంటున్నారు

వైసీపీ ప్రభుత్వం నైతిక విలువలను కోల్పోయింది. రాష్ట్ర ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారు. కేవలం వ్యక్తిగత దూషణలకు మాత్రమే పరిమితమై, సుపరిపాలన అందించలేని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం. రాష్ట్రంలోని అధ్వాన్నమైన రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ నిరసన కార్యక్రమం చూసి ప్రభుత్వం భయపడింది. ఆ భయంతో ఏదో ఒక రకంగా ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తోంది. పనికిమాలిన వ్యక్తులను రెచ్చగొట్టి అలజడి సృష్టించడం జగన్ కు ఒక రకమైన ఆనందం.

  • పాలన చేతకాక సీఎం ఇంట్లో కూర్చున్నారు

పాలకులు పీఠం ఎక్కేముందు ఒకలా… పీఠం ఎక్కిన తరవాత ఒకలా మారిపోతున్నారు. అధికార పీఠం అందుకున్నాక సామాన్యుల పడుతున్న కష్టాలపై సరైన రీతిలో స్పందించడం లేదు. సంక్షేమ పథకాలు అందిస్తే చాలు లొంగిపోతారని భావిస్తున్నారు. అధికారం కోసం ఆ రోజు పాదయాత్ర చేసి, ముద్దులుపెట్టిన ముఖ్యమంత్రి గారు… దమ్ముంటే ఈ రోజు పాదయాత్ర చేయాలి. క్షేత్రస్థాయిలో ప్రజల పడుతున్న కష్టాలు తెలుసుకోవాలి. పరిపాలన చేతకాక, ఇంట్లో కూర్చొని పాలన చేస్తున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బలంగా బుద్ధి చెబుతారు. కోవిడ్ మరణాల్లో మన రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తతో ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయాం. మన చుట్టు పక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రులు పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శిస్తుంటే… మన ముఖ్యమంత్రి మాత్రం ఒకసారైనా ఆస్పత్రి ముఖం చూడలేదు.

  • కొత్త నోటిఫికేషన్ ఇస్తే భారీగా సీట్లు గెలిచేవాళ్లం

నిజాయతీగా రాజకీయాలు చేయాలి, ప్రతి ఒక్కరికి నాయకత్వం అప్పగించాలనే లక్ష్యంతో జనసేన పార్టీని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే లక్ష్యం కోసం ఆయన పాటుపడుతున్నారు. పార్టీ నిర్మాణంలో భాగంగా క్రియాశీలకంగా సభ్యత్వం కార్యక్రమం చేపట్టాం. దేశంలో ఏ ఇతర పార్టీ చేయని విధంగా ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తకు రూ. 5 లక్షలు బీమా అందిస్తున్నాం. లక్ష కోట్లు సంపాధించి, వేల కోట్లు దోచుకున్న నాయకుడు చేయలేని పని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. పరిషత్ ఎన్నికలు ఎలాంటి పరిస్థితుల్లో జరిగాయో అందరికీ తెలుసు. ఇతర పార్టీ నాయకులు నామినేషన్లు వేయకుండా వైసీపీ రౌడీలు ఎలా అడ్డుకున్నారో మనం చూశాం. అన్ని అడ్డంకులు దాటి జనసేన పార్టీ విజయబావుట ఎగరవేసింది. జనసేన పార్టీ కోరినట్లు ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే అనుకున్న దాని కంటే ఎక్కువ ఎంపీటీసీ సీట్లు సాధించే వాళ్లం” అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ నాయకులు సభ్యులు శ్రీ ముత్తా శశిధర్, డా. హరిప్రసాద్, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, శ్రీ కోన తాతారావు, శ్రీ సత్య బొలిసెట్టి, శ్రీ టి. శివశంకర్,  శ్రీ కందుల దుర్గేశ్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీ ఆర్హం ఖాన్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ బోనబోయిన శ్రీనివాస్, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీ సాంబశివ ప్రతాప్, శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, శ్రీ గాదె వెంకటేశ్వర రావు, శ్రీ షేక్ రియాజ్, శ్రీ పోతిన మహేష్, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ కొటికలపూడి గోవింద రావు, శ్రీ చేగొండి ప్రకాష్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ లతోపాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజక వర్గాల ఇంచార్జులు, అధికార ప్రతినిధులు, జిల్లా కమిటీల సభ్యులు, పార్టీ నుంచి గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular