Perni Nani Comments: రాజకీయ నాయకులు అప్పుడప్పుడు చేసే కామెంట్లు సంచలనం కలిగిస్తుంటాయి. ఒకప్పుడు ఇవి అంతగా ప్రాధాన్యం సంతరించుకునేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి రాజకీయ నాయకులు మాట్లాడిన ప్రతి మాట కూడా సంచలనంగా మారుతోంది. సోషల్ మీడియా వల్ల వివాదాస్పదమవుతోంది. ఇటువంటి వ్యాఖ్యల వల్లే రాజకీయాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. తాజాగా ఏపీ మాజీమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వైసిపి కీలక నాయకుడు పేర్ని నాని పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేశారు. అంతేకాదు తమ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను, ఇతర విషయాలను కూడా ఆయన పంచుకున్నారు.. పార్టీ ఎందుకు ఓడిపోయింది.. ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఏం చేయబోతోంది.. ప్రజా సమస్యలపై ఏవిధంగా పోరాడబోతోంది.. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలు ఏమిటి.. పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి.. వంటి వాటిపై పేర్ని నాని తనదైన వ్యాఖ్యలు చేశారు. సహజంగానే పేర్ని నాని ఓపెన్ గా మాట్లాడుతుంటారు. ఆ వ్యాఖ్యత అడిగిన ప్రశ్నలకు కూడా అలానే సమాధానాలు చెప్పారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు మైత్రి గురించి అడిగిన ప్రశ్నకు పేర్ని నాని తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
“చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉండడానికి ప్రధాన కారణం జగన్. ఎందుకంటే జగన్ అనే వ్యక్తిని భూతంగా చూపించి ఏపీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఏపీ ప్రజలలో ఒక రకమైన భయాన్ని కలగజేస్తున్నారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేరు కాబట్టి వారిద్దరు ఏకమవుతున్నారు. వారిద్దరిలో ఎన్ని గొడవలు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. విడిపోరు. పైగా తమలో తాము ఎన్ని కల హాలు పెట్టుకున్నా సరే కలిసి ఉంటారు. ఎందుకంటే వీరిద్దరూ కలిస్తేనే జగన్ ను ఒంటరిగా ఎదుర్కొంటారు. లేకుంటే ఇబ్బంది పడక తప్పదని” నానీ వ్యాఖ్యానించారు. నాని వ్యాఖ్యల నేపథ్యంలో కూటమినేతలు స్పందిస్తున్నారు. గతంలో చంద్రబాబును ఒంటరిగా ఎదుర్కోవడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొత్తులు పెట్టుకోలేదా.. పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు కదా.. ఆ విషయం పేర్ని నానికి గుర్తుకు లేదా అంటూ సెటైర్లు వేస్తున్నారు.