Danish Kaneria X post: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. భారత్ పోరాటం ముందు తలవంచింది. ఈ గెలుపు ద్వారా టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు సాధించిన జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ జట్టు ఓటమి నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ జట్టు మాజీ ఆటగాడు డాష్ కనేరియా కూడా సంచలన ఆరోపణలు చేశాడు. పాకిస్తాన్ ఓటమిని వ్యంగ్యంగా విమర్శించాడు.
ఇండియా పై మ్యాచ్ ఓడిపోగానే గ్రిల్స్ లోపల భద్రంగా ఉన్న టీవీ ఫోటోను సోషల్ మీడియాలో కనేరియా షేర్ చేశారు. ఎటువంటి కామెంట్లు కూడా చేయలేదు. కాకపోతే అతడు పోస్ట్ చేసిన ఫోటో టీమ్ ఇండియా అభిమానులకు విపరీతమైన ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే.. అది కూడా భారత జట్టు మీద ఓడిపోతే తట్టుకోలేరు. వీధులలోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తారు. నినాదాలు చేస్తూ అక్కసు మొత్తం బయటపెడుతుంటారు.
గతంలో పాకిస్తాన్ జట్టు టీమ్ ఇండియా మీద మ్యాచులు ఓడిపోయినప్పుడు టీవీలను పగలగొట్టారు ఆ జట్టు అభిమానులు. అంతేకాదు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. టీమ్ ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. టీమిండియా తమ పై అన్యాయంగా గెలిచిందని ఆరోపించారు. ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంతో గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కనేరియా ఈ తరహాలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది.. గతంలో కనేరియా తన మతం గురించి వ్యాఖ్యలు చేశాడు.. ” నేను హిందువుగానే పుట్టాను. హిందువుగానే పోతాను. అంతేతప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం స్వీకరించనని” కనేరియా వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో అతడు చేసిన వ్యాఖ్యల పట్ల పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. అతడిని దేశద్రోహిగా అభివర్ణించారు.