CM Jagan: ప్రజలకు దగ్గరగా ఉంటూ.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే నాయకుడు ప్రజా నాయకుడు అవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు అదుకుని, అండగా నిలిచి, వాటిని తీర్చేవాడు లీడర్ అవుతాడు. ప్రజాదరణ ఉంటే.. రాజకీయంగా ఎదుగుతాడు. ఇదీ రాజకీయ సూత్రం. ప్రజాదరణ లేని ఏ నాయకుడూ రాజకీయంగా ఎదగలేడు. ప్రజల కష్టాలు పట్టించుకోని నాయకుడికి పతనం తప్పదు. ఇందుకు ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే నిదర్శనం. అహంకారం.. తాము మాత్రమే చేయగలం… ఇంకెవరూ చేయలేరు అన్న పొగరు. మేం చేసిందే గొప్ప.. మా మాటే వినాలి.. మమ్మల్నే ఫాలో అవ్వాలి.. మీకు మేం తప్ప ఎవరూ దిక్కులేరు అన్న కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు ధోరణి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి కారణాలు. కానీ, ఈ అంశాలను ఆ పార్టీ నేతలు ఇప్పటికీ అంగీకరించడం లేదు. అదే దురుసు.. అదే పొగరు.. అదే అహంకారం.. ప్రదర్శిస్తున్నారు. దాని ఫలితమే తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ చిత్తుగా ఎడిపోవడం. ఇంకా ఇదే ధోరణి కొనసాగితే.. ఓటమి నుంచి పాఠం నేర్చుకోకుంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. మార్పు అంటూ ఉంటే.. బీఆర్‌ఎస్ బలం ఇంకా తగ్గడమే తప్ప పెరగదు.
మరి ఏపీ పరిస్థితి ఏంటి..?
వచ్చే లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలూ జరుగనున్నాయి. మరో నెల రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీకి కూడా అప్పుడే షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయి అన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న ఆసక్తే అందరిలో నెలకొంది.
వైసీపీ పాలనపై విసుగు..
ఏపీలో అధికార వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారు. 2019లో టీడీపీపై ఉన్న ప్రజల్లో ఉన్న అభిప్రాయమే ఇప్పుడు వైసీపీపై ఉంది. సంక్షేమం పేరుతో డబ్బులు పంచుతున్నా.. అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదు. కొత్తగా రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావొస్తున్నా.. రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి. ఇక నేతల అవినీతి, అక్రమాలకు అంతే లేదు. తమదే ప్రభుత్వం అన్న సాకుతో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కిందిస్థాయి నేతల వరకే అందరూ అవినీతి, అక్రమాల బాటలోనే సాగుతున్నారు. దౌర్జన్యాలు, కబ్జాల పర్వం ఆగడం లేదు.
అదే అహంకారం..
వివిధ పథకాల పేరుతో అప్పులు తెచ్చి ప్రజలకు డబ్బులు పంచుతున్న జగన్.. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకునే అంశం ఒక్కటీ లేదు. చంద్రబాబు కనీసం అమరావతి నిర్మాణం మొదలు పెట్టారు. కానీ, జగన్ చేసింది మాత్రం సున్నా.. ఉన్న రాజధాని ఎత్తేయడమే కాకుండా.. మూడు రాజధానుల ఆట మొదలు పెట్టాడు. కానీ, అది కూడా కార్యరూపం దాల్చలేదు. పోలవరం పూర్తి చేసేది తామే అని టీడీపీ హయాంలో పదే పదే చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు మంత్రులు అయ్యారు. కానీ, ఐదేళ్లలో వారు చేసిన పని పది శాతం మించి లేదు. అయినా.. తామే చేస్తున్నాం.. నాడు లేని పథకాలు నేడు ఉన్నాయి. నాడు లేని డబ్బులు నేడు వస్తున్నాయి.. నాడు అందని ఫలాలు నేడు అందుతున్నాయి.. అని గొప్పలు చెప్పుకోవడమే. చంద్రబాబు మారడంతోనే అన్నీ అందిస్తున్నామని అహంకారం ప్రదర్శించడం మినహా జగన్ చేస్తున్నది శూన్యం అన్న అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఏర్పడింది.
మాతో కాకుంటే అంతే..
ఇక జగన్ అహంకారం ఇంకా ఎలా ఉంది అంటే.. రాష్ట్రంలో ఏది చేయాలన్నా తామే చేయాలన్నట్లుగా పాలకులు తయారయ్యారు. తాము చేయకుంటే ఎవరూ చేయలేరు అన్న అహంకారం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన పనులు చేయకపోగా వాటికి ఇప్పుడు కుంటి సాకులు వెతుక్కుంటున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వాటిని అధికమించేందుకు తప్పు తమది కాదని, గత ప్రభుత్వం చేసిందే అని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే ప్రజలు ఓడించారు. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు దానిని సరిదిద్దకుండా.. మళ్లీ ఎన్నికల వేళ.. పాత ప్రభుత్వంపైనే నిందలు వేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇన్నాళ్లు మీరు ఏం చేశారు.. గుడ్డి గుర్రం పండ్లు తోఆమారా అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంతా జగన్నామమే..
ఇక ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అంతా జగన్నామస్మరణే చేస్తున్నారు. వ్యక్తి పూజ, భజన మినహా ప్రజలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. జగనేమో ప్రజలే నా దేవుళ్లు అంటున్నాడు. నేను పైన దేవుడిని, కింద ప్రజలను నమ్ముకున్నా అని చెబుతున్నాడు. నేతలేమో జగన్నామస్మరణలో తరిస్తున్నారు. జగన్ చెప్పిందే వేదం.. జగన్ చేసిందే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే సాహసం కూడా చేయడం లేదు.
జగన్ పిలిస్తేనే తాడేపల్లి గేట్లు తెరుచుకునేది..
ఇక జగన్‌ను కలవడం మంత్రులు, ఎమ్మెల్యేలకు అంత ఈజీ కాదు. ఆయనను కలవాలంటే అంత సులువుగా అపాయింట్ మెంట్ దొరకదు. ఆయన పిలిస్తే మాత్రమే తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ గేట్లు తెరుచుకుంటాయి. లేదంటే అనుమతే ఉండదు. అలాంటప్పుడు ప్రజా సమస్యలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉండడం లేదు. ఇక సామాన్యుడు అయితే.. అటువైపు కూడా చూసే అవకాశం లేదు.
ప్రజలు మాతో ఉన్నారన్న భ్రమలో..
ఐదేళ్లుగా ప్రజలు మాతోనే ఉన్నారు అన్న భ్రమలోనే జగన్ పాలన సాగిస్తున్నారు. మొదటి రెండేళ్లు ప్రజలు వైసీపీ సర్కార్‌కు అనుకూలంగానే ఉన్నారు. కానీ, పాలన సాగుతున్న కొద్దీ నేతల తీరు, జగన్ అహంకార ధోరణి, ప్రజలను కలిసే తీరిక లేకపోవడం, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం, అభివృద్ధి గురించి ఆలోచన చేయకపోవడం, కనీసం రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వెరసి ప్రజల్లో పాలకులపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. కానీ, జగన్ అండ్ కో ఇప్పటికీ ప్రజలు మాతోనే ఉన్నారని భ్రమ పడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు కూడా ఇలానే భ్రమపడ్డారు. మేం ఏం తక్కువ చేశాం అని అహంకారానికి పోయారు. కానీ ఎన్నికల్లో ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా బాబు చేయనివన్నీ మేం చేశాం.. ప్రజలకు ఏదీ తక్కువ చేయలేదు.. చెప్పినదానికన్నా ఎక్కువే చేశాం. మేం తప్ప ప్రజలకు దిక్కులేదు అన్న అహంకారం ప్రదర్శిస్తున్నారు. మరి ఈ అహంకార ధోరణి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్‌ను ఏం చేస్తుందో చూడాలి.