Andhra Pradesh: అమ్మో ఒకటో తారీకు.. పింఛన్లు అందుతాయా?

పింఛన్ల పంపిణీ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. మరణాలు మా లెక్క కాదంటే మా లెక్క కాదు అని అధికార,విపక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి.

Written By: Dharma, Updated On : April 29, 2024 3:07 pm

Pensions to be door delivered in Andhra Pradesh

Follow us on

Andhra Pradesh: ఒకటో తేదీ సమీపిస్తోంది. ఒకరోజు వ్యవధి మాత్రమే ఉంది. దీంతో పింఛన్ల వివాదం తెరపైకి వచ్చింది. 1వ తేదీన ఇంటింటా పింఛన్లు అందించాల్సి ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా వలంటీర్లే పింఛన్ల పంపిణీ చేపట్టేవారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించేవారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను ప్రస్తుతం పక్కన పెట్టారు. దీంతో ఏప్రిల్ లో పింఛన్ల వ్యవహారం రచ్చగా మారింది. పింఛన్ల కోసం వచ్చిన వారు దాదాపు 32 మంది మరణించారని ప్రభుత్వమే చెప్పుకొచ్చింది. అయితే ఈ నెల కూడా దీనిపై రచ్చ జరిగే అవకాశం ఉంది.

పింఛన్ల పంపిణీ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. మరణాలు మా లెక్క కాదంటే మా లెక్క కాదు అని అధికార,విపక్షాలు ఆరోపణలు చేసుకున్నాయి. ఈ పాపం టిడిపి దేనని వైసిపి ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం ఉదాసీనత వల్లే ఇలా జరిగిందని టిడిపి ఆరోపించింది.అయితే ఎవరిది తప్పైనా.. మూల్యం చెల్లించుకున్నది మాత్రం ఆయా లబ్ధిదారుల కుటుంబాలే. ఈ క్రమంలో విపక్షాల నుంచి ఇంటింటికి తీసుకువెళ్లి పింఛన్లు ఇవ్వాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈనెల 15 నుంచి ప్రతిపక్షాలు ఈ విషయంపై ఇటు ఎన్నికల సంఘానికి, అటు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వచ్చాయి.

అయితే ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా ఉంది. ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించలేమని చెబుతోంది. దీనికి రకరకాల కారణాలు చెబుతోంది. సచివాలయ ఉద్యోగులు 8 మంది మాత్రమే ఉంటారని.. వారితో పింఛన్లు అందించడం కుదిరే పని కాదని తేల్చేసింది. కేవలం మంచంలో ఉన్న రోగులకు మాత్రమే ఇంటింటికి పంపిణీ చేస్తామని చెబుతోంది. మిగిలిన వారికి బ్యాంకుల్లో వేస్తామని ప్రకటించింది. అయితే పింఛన్ లబ్ధిదారులకు నరకం చూపించడం ద్వారా.. ఆ అపవాదును తెలుగుదేశం పార్టీపై నెట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ నెల పింఛన్లు సకాలంలో అందుతాయా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే గత నెలలో పింఛన్ లబ్ధిదారుల అకౌంట్లు లేవని చెప్పిన ప్రభుత్వానికి.. 48 లక్షల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు ఎలా తెలిశాయని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న పనిగా ఆయన అనుమానిస్తున్నారు. ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.