AP Elections 2024: ఏపీలో పింఛన్ల రాజకీయం నడుస్తోంది. గత నెలలో పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తప్పు మీదంటే మీది అంటూ అధికార విపక్షాలు ఆరోపించుకున్నాయి. కానీ పింఛన్ లబ్ధిదారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మండుటెండలో వృద్ధులు ఆపసోపాలు పడ్డారని.. ఓ 32 మంది వృద్ధులు చనిపోయారని ప్రభుత్వమే గణాంకాలతో సహా వెల్లడించింది. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాల్సింది పోయి… ఈ నెలలో సైతం వృద్ధులకు రిక్త హస్తం అందించారు. నేరుగా బ్యాంకు ఖాతాలోనే పింఛన్ మొత్తాన్ని జమ చేస్తామని చెప్పుకొచ్చారు. నిన్న పింఛన్ల కోసం సచివాలయాలకు వెళ్లిన వృద్ధులకు.. నేరుగా పింఛన్లు ఇవ్వడం కుదరదని.. ఖాతాల్లోనే నగదు జమ చేశామని అక్కడ సిబ్బంది చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ జరిగేది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ సేవలో ఉన్న వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ సరికాదని ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్లాయి. దీంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్లను విధుల నుంచి తప్పించింది. అయితే ఇక్కడే అసలు సిసలు రాజకీయం ప్రారంభమైంది. అసలు ఏపీలో వ్యవస్థలు లేవన్నట్టు.. వాలంటీర్లే అన్నిటికీ దిక్కు అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించింది. వాలంటీర్లను తొలగించడం వల్లే పింఛన్ల పంపిణీ ఆలస్యమైందని.. ఇందుకు ముమ్మాటికి టిడిపి కారణమని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం ఏప్రిల్ నెల పింఛన్కు సంబంధించి ముందుగానే ఒక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఓ మూడు రోజులపాటు పింఛన్ల పంపిణీ ఆలస్యం అవుతుందని ప్రకటించింది. ఎప్పుడైతే వాలంటీర్లపై ఈసీ వేటు వేసిందో.. దానిని ఒక రాజకీయ అంశంగా మార్చేసింది. గత 50 నెలలుగా సవ్యంగా సాగిన ప్రక్రియకు టిడిపి అడ్డగించిందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసింది.
ఏప్రిల్ మాదిరిగా మేలో పింఛన్ల పంపిణీ ఆలస్యం అవ్వకూడదని.. సచివాలయ సిబ్బందితో పాటు పంచాయతీరాజ్ స్టాఫ్ తో పింఛన్ల పంపిణీ చేయాలని విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబుతో పాటు పవన్ ఎన్నికల కమిషన్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. అయితే ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చేసింది. కేవలం మంచం పై ఉన్న వారికి మాత్రమే పింఛన్లు అందించగలమని చెప్పుకొచ్చింది. మిగతా వారికి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో కేవలం 48 లక్షల మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. అయితే మిగతా లబ్ధిదారుల పరిస్థితిఏమిటన్నది తెలియడం లేదు. కేవలం రెండు మూడు రోజులపాటు పింఛన్లు ఆలస్యం చేసి ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీపై వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే గత నెల రోజులుగా ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ను అలెర్ట్ చేస్తున్నామని.. ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం పింఛన్ల పంపిణీ ఆలస్యం చేస్తోందని విపక్షాలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. మొత్తానికైతే ఏపీలో పింఛన్ల రాజకీయం రసవత్తరంగా మారుతోంది.