Jagan Narsipatnam Visit: ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడాన్ని ప్రజలు సహించరు. అలా చేసిన ప్రతిసారి ప్రజల నుంచి ఒక రకమైన సంకేతం వస్తుంది. అది ముదిరితే ప్రమాదమే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) అదే పరిణామం ఎదురైంది. పరాభవంగా మారింది. ఏపీలో ఉద్యమాలకు, నిరసనలకు అవకాశం లేకుండా చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల పర్యటనలను కూడా అడ్డుకున్నారు. చివరకు నిర్బంధించే ప్రయత్నం చేశారు. దానిని సమర్థించుకున్నారు కూడా. అయితే ఆ చర్యలను ప్రజలు సహించలేదు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేశారు. అయితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వంపై ఉంది.
* ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టే..
ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో( Narsipatnam) పర్యటించనున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ ఆయన ఆందోళన పాట పెట్టారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నుంచి తన పోరాటాన్ని మొదలు పెడతానని ప్రకటించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం గుండా పర్యటనకు అనుమతులు నిరాకరించారు పోలీసులు. అయితే పోలీస్ శాఖ చెబుతున్నది సహేతుకంగా ఉన్న.. జగన్మోహన్ రెడ్డి మానసికంగా పర్యటనకు సిద్ధపడిపోయారు. వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి. వారికి అది అలవాటైన విద్య కూడా. అయితే ఆ పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటే ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టే. ప్రభుత్వం భయపడినట్టే. కానీ పట్టించుకోకుండా ఉంటే కూటమికి వచ్చే నష్టమేమీ లేదు. దీనికి గత అనుభవాలే కారణం.
* అలా వ్యవహరించినందుకే..
వైసీపీ హయాంలో అన్ని వర్గాలను అడ్డుకున్న ఘనత అప్పటి ప్రభుత్వానిది. జగన్ బయటకు వస్తే.. చంటి సినిమా మాదిరిగా ప్రజలు పరదాల మాటున వెళ్లాల్సి వచ్చేది. ప్రజా సంఘాల నేతలు ముందస్తు అరెస్టులు కావాల్సిందే. సమస్యలపై పోరాడేందుకు రోడ్డుపైకి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయులను ఏ స్థాయిలో అడ్డుకున్నారో తెలిసిందే. చివరకు అమరావతి రైతులను అడుగడుగునా అడ్డగించారు. మహిళా రైతులు అని కూడా చూడలేదు. దారుణంగా అవమానించారు. నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెడితే అడ్డంగా వచ్చి అభ్యంతరాలు తెలిపేవారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు పవన్ కళ్యాణ్ ను విశాఖలోనే హోటల్లో నిర్బంధించారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును జైల్లో పెట్టారు. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచేశారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఇవేవీ కనిపించలేదు. కానీ ప్రజలు గమనించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అడ్డగింతలు, అభ్యంతరాలకు దూరంగా ఉండాలి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మున్ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఇట్టే అనుమతి లభించనున్నట్లు సమాచారం. అయితే జన సమీకరణ, జనాల పిచ్చితో ఏవైనా సమస్యలు వస్తే అందుకు మూల్యం చెల్లించుకునేది కూడా జగనే.