Pawankalyan Vs YCP : పవన్ ఈసారి శాసనసభలో అధ్యక్ష అనాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. తనతో పాటు పదుల సంఖ్యలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కాలని భావిస్తున్నారు. అందుకే పొత్తుల కోసం మొగ్గుచూపుతున్నారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందలేనని తేల్చేశారు. ఇప్పుడు వారాహి యాత్రకు సిద్ధమవుతున్న వేళ పవన్ ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతోంది. దాదాపు అరడజను నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నా..ఎక్కడ నుంచి బరిలో దిగుతారన్న విషయం వ్యూహాత్మకంగా బయటపెట్టడం లేదు.
గత ఎన్నికల్లో పవన్ గాజువాకతో పాటు భీమవరం నుంచి పోటీచేశారు. రెండుచోట్ల ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో పాత స్థానాల నుంచి పోటీచేస్తారా? అంటే సమాధానం లేదు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం, కాకినాడ రూరల్, తిరుపతి, అనంతపురం ఇలా చాలా నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ జనసేన హైకమాండ్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయడం లేదు. ఒక వైపు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సీరియస్ గా జరుగుతున్న చర్చల నడుమ పవన్ పోటీచేసే నియోజకవర్గం విషయంలో గోప్యత పాటిస్తున్నారు.
పవన్ ఎక్కడి నుంచి బరిలో దిగుతారో? అన్న ఆత్రం ఎక్కువగా వైసీపీలోనే కనిపిస్తోంది. పవన్ పై నిత్య విమర్శలకు దిగే మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల ఒక ప్రకటన చేశారు. వారాహిపై విషం చిమ్ముతూనే పవన్ పిఠాపురం నుంచి పోటీచేస్తారని తేల్చిచెప్పేశారు. పవన్ పోటీ చేసే సీటు గురించి వైసీపీ నేత ప్రకటించడం మాత్రం విశేషంగానే చూడాలి. అయితే పవన్ పోటీచేసే సీట్ల జాబితాలో పిఠాపురం ఉంది. అక్కడ కాపులు ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసిన శేషుకుమారికి పాతిక వేల పై చిలులు ఓట్లు వచ్చాయి. 2009లో ప్రజారాజ్యం సొంతం చేసుకున్న సీటు కూడా ఇది. ఇలా అన్నవిధాలా ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకొని పవన్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని వైసీపీ అనుమానిస్తోంది.
పవన్ జనసేన క్యాండిడేట్ అయితే వైసీపీకి ఎవరన్నది ప్రశ్న. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీద జనంలో వ్యతిరేకత ఒక స్థాయిలో ఉంది. టీడీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉంది. మాజీ ఎమ్మెల్యే వర్మ తో పాటు మరికొందరు టికెట్ కోసం ట్రై చేస్తున్నారు.ఇటువంటి తరుణంలో పవన్ బరిలో దిగితే గెలుపు నల్లేరు మీద నడకే. కానీ ఇక్కడ వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 2009లో పీఆర్పీ నుంచి గెలిచిన వంగ గీతను ఇక్కడ నుంచి పోటీచేయించేందుకు డిసైడయ్యింది. ప్రస్తుతం ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆమెను పోటీచేయిస్తే ప్లస్ పాయింట్లు ఉన్నాయని వైసీపీ భావిస్తోంది. కానీ ఏం జరుగుతుందో చూడాలి మరీ.