Pawankalyan : పవన్ రియాక్షన్..ఈసారి విద్యావ్యవస్థపైనే..

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని జగన్ సర్కారు తరచూ చెబుతూ ఉంటుంది. కానీ పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు వంటి వాటితో పూర్తిగా నిర్వీర్యం చేసింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ విద్యావ్యవస్థలో పాలనా వైఫల్యాలపై పోరాటం మొదలుపెట్టడం విశేషం.

Written By: Dharma, Updated On : July 22, 2023 5:21 pm
Follow us on

Pawankalyan : జనసేనాని పవన్ జగన్ సర్కారుపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఇప్పటికే వలంటీరు వ్యవస్థపై ప్రశ్నించి ముప్పతిప్పలు పెట్టారు. ప్రభుత్వం పవన్ ను ప్రాసిక్యూషన్ కు అనుమతిచ్చినా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ పాలనా వ్యవస్థలపై సుతిమెత్తగా, సుత్తి లేకుండా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ఈసారి విద్యారంగంపై పడ్డారు. ఇప్పటికే అతి పెద్ద ప్రభుత్వ బాధిత వర్గంగా ఉన్న ఉపాధ్యాయులకు మద్దతుగా.. విద్యావ్యవస్థలో ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాల్లో మార్పులపై ప్రశ్నలపరంపరకు దిగారు. బైజూస్ కంటెంట్, విద్యాసంస్కరణలను టార్గెట్ చేసుకుంటూ చేసిన ట్విట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వలంటీరు వ్యవస్థ తరువాత ఇప్పుడు విద్యాశాఖపై పవన్ ఫోకస్ పెట్టడం సంచలంగా మారుతోంది.

పవన్ వ్యక్తిగత జీవితంపై సీఎం జగన్ టార్గెట్ చేసుకున్నారు. ఈసారి వివాహేతర సంబంధాలపై కూడా మాట్లాడారు. ఎప్పుడు చేసిన ఆరోపణలే కావడంతో ప్రజలు కూడా లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నుంచి ఏ స్థాయిలో రియాక్షన్ వస్తుందోనని అంతా ఆశించారు. కానీ పవన్ అనూహ్యంగా విద్యావ్యవస్థలో లోపాలపై పడడం అందరూ ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ బాధిత వర్గమైన ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల సమస్య ఇందులో దాగి ఉండడంతో పవన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ల రిక్రూట్ మెంట్ లేదని, టీచర్లకు శిక్షణ కూడా లేదని, కానీ నష్టాల్లో ఉన్న స్టార్టప్ బైజూస్ కు మాత్రం ప్రభుత్వ ఒప్పందం దక్కడాన్ని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో ప్రశ్నించారు.

పవన్ ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ప్రభుత్వ విద్యార్థులకు విద్యాబోధనకు బైజూస్ సంస్థతో జగన్ సర్కారు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిని ఆహ్వానించిన పవన్ ఉపాధ్యాయులు లేకుండా బోధన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ మంచిదేనని.. అదే సమయంలో పాఠశాలలో మరుగుదొడ్లు ఎందుకు ఏర్పాటుచేయడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన బైజూస్ తో ఒప్పందం చేసుకున్నారని… 2021 నాటికి 17 రెట్లు నష్టాన్ని చవిచూసిన విషయాన్ని గుర్తుచేస్తూ ట్విట్టర్ లో అందుకు తగిన వీడియోలు పొందుపరిచారు. మెగా డీఎస్సీ లేదని… టీచర్ల భర్తీ జరగడం లేదని.. కనీసం వారికి శిక్షణ కూడా లేదని.. కానీ నష్టాల్లో ఉన్న బైజూస్ సంస్థను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేశామని జగన్ సర్కారు తరచూ చెబుతూ ఉంటుంది. కానీ పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు వంటి వాటితో పూర్తిగా నిర్వీర్యం చేసింది. పూటకో జీవోతో అయోమయానికి గురిచేస్తోంది. పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రజల్లో పలుచన చేయడానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ విద్యావ్యవస్థలో పాలనా వైఫల్యాలపై పోరాటం మొదలుపెట్టడం విశేషం. ఏదో అన్నట్టు కాకుండా నిర్మాణాత్మకంగా, లోతుగా అధ్యయనం చేసి జగన్ సర్కారుపై ఆరోపణలు చేస్తుండడాన్ని ప్రజలు సైతం గుర్తిస్తున్నారు. ప్రభుత్వ బాధిత వర్గంగా మారిన ఉపాధ్యాయులు సైతం ఆహ్వానిస్తున్నారు.