Pavan Kalyan : పవన్ తనకు ఇష్టమైన శాఖలను నిర్వర్తిస్తున్నారు. పల్లెలన్నా, అడవులు అన్నా పవన్ కు ఎంతో ఇష్టం. తన సినిమాల్లో సైతం ఈ రెండు ఇతివృత్తాలను అధికంగా తీసుకుంటారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక అదే పరంపరను కొనసాగిస్తున్నారు. డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు ఆరు కీలక శాఖలను నిర్వర్తిస్తున్నారు. అందులో అటవీ శాఖ ఒకటి. ప్రధానంగా అడవులను సంరక్షించే చర్యలు చేపడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై దృష్టి పెట్టారు. ఉక్కు పాదంతో అణచివేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు అటవీ జంతువుల సంరక్షణకు కూడా నడుంబిగించారు. అరుదైన జంతుజాలాలను పరిరక్షించుకోవాలని భావిస్తున్నారు. అదే అటవీ జంతువుల నుంచి మనుషులను సైతం రక్షించాలని చూస్తున్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో వన్యప్రాణుల భారీ నుంచి ప్రజలను రక్షించేందుకు సత్వర చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే కర్ణాటకలో పర్యటిస్తున్నారు. అక్కడ అటవీ శాఖ మంత్రితో ప్రత్యేక చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు విజయవంతం అయితే.. ఏపీలో ఒక దీర్ఘకాలిక సమస్యకు పరిష్కార మార్గం దొరకనుంది.అదే జరిగితే ఏ ప్రభుత్వము చేయని ప్రయత్నం చేసినట్టు అవుతుంది. టిడిపి కూటమి ప్రభుత్వంతో పాటు పవన్ కు ప్రత్యేక గుర్తింపు లభించనుంది. అదే సమయంలో ప్రజలు పడుతున్న బాధకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. గతంలో ఏ ప్రభుత్వము ఇటువంటి ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నారు. పవన్ కర్ణాటక ఎందుకు వెళ్లారా? అని ఆరా తీస్తున్నారు.
* ఆ మూడు జిల్లాల్లో భయమే
ఏపీలో చాలా జిల్లాల్లో వన్యప్రాణుల బెడద అధికంగా ఉంది. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గ్రామాల మీద పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అప్పుడప్పుడు ప్రాణహానిసైతం జరుగుతోంది. అటవీ శాఖ కేవలం కంటి తుడుపు చర్యలకే పరిమితమవుతోంది. ఏనుగులను అడవులకు తరలించే ప్రయత్నాలు సైతం ఫలించడం లేదు. ఈ సమస్య నానాటికీ తీవ్రతరం అవుతోంది. అందుకే అటవీ శాఖమంత్రిగా ఉన్న పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
* దశాబ్దాలుగా ఇదే సమస్య
దశాబ్దాలుగా ఏనుగుల సమస్య అధికంగా ఉంది. ఒడిస్సా లోని లఖేరి అటువుల నుంచి ఏనుగులు తరలి వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో సంచరిస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు గురిచేస్తున్నాయి. అటు చిత్తూరులో సైతం అదే పరిస్థితి ఎదురైంది. ఈ తరుణంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఎకరాల పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఏనుగుల నియంత్రణకు రకరకాల పథకాలు, ప్రయోగాలు తెరపైకి వచ్చాయి. ఏనుగుల క్యారీడర్, అడవుల్లో ట్రంచ్ల ఏర్పాటు వంటి అంశాలు చర్చకు వచ్చాయి. కానీ ఇవేవీ కార్యరూపంలోకి రాలేదు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే వీటికోసం ప్రత్యేక పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు.
* బెంగళూరుకు పవన్
అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ అటవీశాఖ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వన్యప్రాణుల నియంత్రణకు ఏం చేయాలి అన్నదానిపై అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. అయితే ఏనుగులను తరమాలంటే కుమ్కి ఏనుగులు అవసరమని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన వాటికే కుమ్కి ఏనుగులు అంటారు. దీంతో ఈ ఏనుగుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అది బెంగళూరులో ఉంటాయని అధికారులు చెప్పడంతో అక్కడి ప్రభుత్వంతో ఆశ్రయించారు పవన్. వాటిని తీసుకొచ్చి ఆపరేషన్ మొదలు పెట్టడానికి నిర్ణయించారు. అందుకే ఈరోజు పవన్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. అక్కడి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రేతో చర్చలు జరపనున్నారు. త్వరలో ఏనుగుల సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుందని బాధిత జిల్లాల ప్రజలు ఆశిస్తున్నారు.