Deputy CM Pawan Kalyan : టీటీడీ లడ్డు వివాదం.. కన్ఫ్యూజన్ పై పవన్ సంచలన కామెంట్స్!
డిప్యూటీ సీఎం కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ ప్రతి చర్య హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ వివాదం పై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలపై సైతం పవన్ భిన్నంగా కామెంట్స్ చేయడం విశేషం.
Deputy CM Pawan Kalyan : తిరుమల లడ్డు వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా సుప్రీంకోర్టు కామెంట్స్ తో వైసీపీ నుంచి వస్తున్న అనుమానాలు బలపడుతున్నాయి. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు వాడుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. దీంతో కోట్లాదిమంది భక్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే అనూహ్యంగా సుప్రీంకోర్టు దీనిపై ఘాటుగా రియాక్ట్ అయ్యింది.చంద్రబాబు చర్యలను తప్పు పట్టింది. చంద్రబాబు సర్కార్ ఏర్పాటుచేసిన సిట్ విచారణ పై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరుతూ ఈనెల 3కు కేసును వాయిదా వేసింది. అయితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం జగన్ ఆరోపణలు చేశారు.సంక్షేమ పథకాల అమలుపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకేనని అనుమానం వ్యక్తం చేశారు.అయితే కోట్లాదిమంది భక్తుల మనోభావాలు విషయంలోజాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి.. రాజకీయాలు చేశారని అర్థం వచ్చేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అక్కడి నుంచి వైసీపీ తిరిగి రివర్స్ అయ్యింది. సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శల దాడి కొనసాగిస్తోంది.
* అలా జడ్జిలు చెప్పలేదట
ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు.తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తిరుమలలో తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా చెప్పలేదని అన్నారు. విచారణ జరుగుతున్న సమయంలో తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే అలా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. నెయ్యి కల్తీ పై అందిన లేబరేటరీ నివేదికల్లో పొందుపరిచిన తేదీల్లో కొంత గందరగోళం ఉందని మాత్రమే జడ్జీలు చెప్పారని పవన్ గుర్తు చేశారు. తదుపరి విచారణలో వాటిపై స్పష్టత ఇస్తామని చెప్పుకొచ్చారు.ఒక్క లడ్డు ప్రసాదం గురించే కాకుండా.. గత ఐదు సంవత్సరాలలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయో.. వాటన్నింటిని కోర్టు ముందు ఉంచుతామని స్పష్టం చేశారు పవన్.
* ఐదేళ్లలో ఎన్నో విధ్వంసాలు
అలాగే తన ప్రాయశ్చిత్త దీక్ష పై స్పష్టతనిచ్చారు. కేవలం లడ్డు వివాదంపై తాను దీక్ష చేపట్టలేదని.. దాని ఉద్దేశం వేరే ఉందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో హిందూ దేవాలయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయని గుర్తు చేశారు. రామతీర్థం ఆలయంలో స్వామివారి విగ్రహాలను ధ్వంసం చేశారని.. అంతర్వేదిలో ఏకంగా రధాన్ని కాల్చేశారని గుర్తు చేస్తూ మండిపడ్డారు పవన్. ఐదేళ్ల వైసిపి పాలనలో హిందూ సనాతన ధర్మంపై దాడులు జరిగాయి అన్నది ప్రధాన ఆరోపణ అన్నారు. కానీ సుప్రీంకోర్టు తప్పు పట్టింది అంటూ ఇప్పుడు వైసీపీ నేతలు చంకలు గుద్దుకోవడం ఏంటని ప్రశ్నించారు. మొత్తానికి అయితే లడ్డు వివాదంలో.. సుప్రీం కోర్టు వాదనలో ఒక రకమైన కన్ఫ్యూజ్ జరిగిందని.. తదుపరి విచారణలో అత్యున్నత న్యాయస్థానం ముందు అన్ని విషయాలను పొందుపరుస్తామని పవన్ చెప్పుకు రావడం విశేషం.