Pawankalyan : పొలిటికల్ హీట్ పెంచిన పవన్.. ఆ అడుగులు వెనుక..

టీడీపీతో పొత్తుల దిశగానేచర్చలు సాగుతున్నాయని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన ఏం చర్చించారనేది కాకుండా... చర్చల వెనుక ఉన్న అజెండాను మాత్రం బయటపెట్టారు.

Written By: Dharma, Updated On : May 1, 2023 11:07 am
Follow us on

Pawankalyan : అసలు పవన్ వ్యూహమేంటి? చంద్రబాబుతో చర్చించేందేమిటి? మొన్నటికి మొన్న బీజేపీ నేతలను కలిసిందెందుకు? ఇప్పుడు కొత్తగా చంద్రబాబును కలవాల్సిన అవసరమెంటి? బీజేపీతో చర్చించిన విషయాలు పంచుకోవడానికే కలిశారా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? గతానికి భిన్నంగా కనీసం ఇద్దరు నేతలు మీడియా ముందుకు ఎందుకు రాలేదు? ఇప్పుడు అందరి మెదళ్లకు తొలుస్తున్న ప్రశ్నలివి. అసలు విషయాలు బయటకు రాకపోవడంతో ఎవరికి వారుగా విశ్లేషణలు చేసుకుంటున్నారు. తమకు తోచిన విధంగా అన్వయించుకుంటున్నారు. అటు చంద్రబాబు,ఇటు పవన్ లు వ్యూహాత్మకంగా మౌనాన్ని ఆశ్రయించి పొలిటికల్ హీట్ పెంచేశారు. ఎన్నడూ లేని విధంగా ఆ ఇద్దరు నేతల ఏకాంత చర్చలు ఏపీలో ప్రకంపనలకు కారణమవుతున్నాయి.

గందరోగళం నడుమ..
టీడీపీ, జనసేనలు కలిసి నడుస్తాయని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అటు పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కానీ ఎక్కడో చిన్న గందరగోళం. జనసేన ఎప్పుడూ మా మిత్రపక్షమేనంటూ బీజేపీ చెబుతోంది. అదే సమయంలో టీడీపీ అంటే నిరాసక్తత చూపుతోంది. కానీ చంద్రబాబు మాత్రం బీజేపీ అంటూ ఆసక్తిచూపుతున్నారు. ఏకంగా ప్రధాని మోదీ విధానాలపై చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారు. ఎన్టీఏ నుంచి వీడిన ఎపిసోడ్ ను ప్రస్తావించి.. అందుకు కారణాలను ‘పరిస్థితులు’పై నెట్టేశారు. మరోసారి ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పవన్ వచ్చి చంద్రబాబుతో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కలయిక, చర్చల వెనుక బీజేపీ పాత్ర ఉందని తెలుస్తుండడంతో సరికొత్త రాజకీయాలకు వేదికగా మారింది.

తేనీటి విందుతో హీట్..
అయితే తాము ఏం చర్చించామనేది పవనూ చెప్పలేదు.. చంద్రబాబూ వెల్లడించలేదు. రెండు తేనీటి కప్పులతో ఇరువురు నేతలు పొలిటికల్ హీట్ పెంచేశారు. టీడీపీతో కలవకూడదనుకున్న కాషాయదళం ఆందోళన చెందుతోంది. కానీ స్వాగతించే వారు మీడియా ముందుకొచ్చి మూడు పార్టీలు కలవబోతున్నాయని సంకేతాలిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు మార్చిన స్ట్రాటజీ అంటూ కొత్త సిగ్నల్స్ ఇస్తున్నారు. అదే సమయంలో ఇష్టం లేని నాయకులు మళ్లీ పాత పాటనే పాడుతున్నారు. టీడీపీతో అన్నది ఉత్తమాటేనని తేల్చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పొలిటికల్ అభిమానులు మాత్రం ఏదో జరగబోతోందని అనుమానిస్తున్నారు.

నాదేండ్ల క్లారిటీ..
ఇటువంటి సమయంలో ఇరువురి నేతల తాజా కలయిక, చర్చల గురించి జనసేన నేత నాదేండ్ల మనోహర్ కొన్నిరకాల సంకేతాలు ఇచ్చారు. టీడీపీతో పొత్తుల దిశగానేచర్చలు సాగుతున్నాయని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న ఆయన ఏం చర్చించారనేది కాకుండా… చర్చల వెనుక ఉన్న అజెండాను మాత్రం బయటపెట్టారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా నినాదమని.. నిన్న చంద్రబాబుతో పవన్ చర్చల్లో ఇదే కీలక అంశమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని చర్చలుంటాయని కూడా ప్రకటించారు. మంచి వ్యూహంతో జనసేన అడుగులుంటాయని మాత్రమే చెప్పుకొచ్చారు. మధ్యలో బీజేపీ గురించి ప్రస్తావించకుండా మిస్టరీని కొనసాగించారు. కేవలం జనసేన, టీడీపీ మధ్య జరుగుతున్న పరిణామాలపై కాస్తా క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే పవన్ అడుగులు ఎవరి ఊహలకు అందనంతగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.