Dokka seethamma : టిడిపి ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 190 వరకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఐదు రూపాయలకే అల్పాహారంతో పాటు భోజనం అందించారు. నిరుపేదలకు, పట్టణ ప్రాంతాలకు వివిధ పనుల మీద వచ్చే వారికి అతి తక్కువ డబ్బులకే ఆహారం అందేది. నిరుపేదలకు ఎంతో ప్రయోజనం చేకూరేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాంటీన్లను నిలిపివేసింది. నిరుపయోగంగా మార్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు తిరిగితెరిపిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తెరిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ పూర్తయింది. టెండర్ల ప్రక్రియ సైతం చేపట్టనున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్న క్యాంటీన్లను యధాతధంగా ఉంచి.. కొత్తగా మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు చేశారు. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు దానిని మార్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గా నామకరణం చేశారు. దీంతో ఎవరి డొక్కా సీతమ్మ? పవన్ ఎందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు? దీని వెనుక ఉన్న కధేంటి అన్న చర్చ ప్రారంభమైంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. గూగుల్ లో ఎక్కువమంది డొక్కా సీతమ్మ గురించే సెర్చ్ చేస్తున్నారు.
* ఆంధ్రుల అన్నపూర్ణ
డొక్కా సీతమ్మ ఉభయగోదావరి జిల్లాల్లో నిత్య అన్నదాతగా, అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందారు. గోదావరి ప్రాంతాల్లో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా గుర్తింపు పొందారు. గోదావరి జిల్లాలో లంక గ్రామాలకు తరచు వరద పోటు ఉంటుంది. ఆ సమయంలో వందలాదిమంది నిరాశ్రయులు అవుతారు. అటువంటి వారందరినీ ఆదుకొని వసతి, భోజన సదుపాయాలను కల్పించిన మహనీయురాలు డొక్కా సీతమ్మ. అన్నదానం చేసి మానవత్వానికి అర్థం చెప్పిన డొక్కా సీతమ్మ పేరు భారత దేశ వ్యాప్తంగా అప్పట్లో మార్మోగింది.
* చలించిపోయిన పవన్
డొక్కా సీతమ్మ చరిత్రను తెలుసుకున్న పవన్ చలించి పోయారు. ఆ మహనీయురాలి పేరిట ప్రభుత్వ పథకాన్ని అమలు చేయాలని భావించారు. ఎన్నికల కు ముందు పార్టీ శ్రేణులతో సైతం ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డొక్కా సీతమ్మ పేరిట క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం విశేషం.
* మధ్యాహ్న భోజన పథకానికి పేరు
వాస్తవానికి ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వ సంయుక్త సహకారంతో అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా కొంత మొత్తాన్ని భరిస్తున్నారు. అయితే ప్రభుత్వం మారిన క్రమంలో పథకం పేరు మారుతూ వస్తోంది. వైసిపి ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట ఈ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు అదే పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మారనుంది. మొత్తానికైతే పవన్ ప్రతిపాదనను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.