Pawan Kalyan Illness : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెండురోజుల పాటు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పవన్ స్వల్ప అస్వస్థతకు గురికావడమే అందుకు కారణం. పవన్ ఉపవాస దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న అన్నవారం సత్యదేవుని సన్నిధిలో ప్రారంభమైన యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో తొలివిడత యాత్ర చేపడుతున్నారు. నియోజకవర్గానికి రెండురోజుల చొప్పున కేటాయిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం భీమవరానికి యాత్ర చేరుకుంది. పవన్ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. 30న సాయంత్రం భీమవరంలో భారీ బహిరంగ సభ జరగనుంది.
పవన్ ఒక వైపు వారాహి యాత్ర చేపడుతునే.. ఖాళీ సమయాల్లో అన్నివర్గాలను కలుస్తున్నారు. వారితో సమావేశమై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. నియోజకవర్గ ప్రముఖులతో సమావేశమై సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ దీక్షలో ఉన్నారు. జూన్ 20 నుంచి వారాహి అమ్మవారి ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఇది వచ్చే నెలలో ముగియనుంది. అలాగే చతుర్మాస దీక్ష సైతం ప్రారంభం కానుంది. కార్తీక మాసం వరకూ పవన్ దీక్షలో కొనసాగే అవకాశముంది. అప్పటివరకూ ఆహారం తీసుకోరు. పాలు, పండ్లను మాత్రమే తీసుకుంటారు.
నిరాటంకంగా సాగుతున్న యాత్ర, క్షణం తీరిక లేకుండా షెడ్యూల్, మరోవైపు దీక్షతో పవన్ అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో కనిపిస్తున్నారు. అందుకే భీమవరంలో తూర్పుకాపులతో సమావేశం ఆలస్యంగా ప్రారంభమైంది. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించినా.. ముందే షెడ్యూల్ ఖరారు కావడంతో కష్టంగా ఉన్నా తూర్పుకాపు ప్రతినిధులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు రెండురోజుల పాటు పవన్ విశ్రాంతి తీసుకోనున్నారు. 30వ తేదీన తిరిగి యాత్ర ప్రారంభించనున్నారు.