Raghu Rama Krishna Raju: ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నికయ్యారు. పదవి బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీని నడిపారు కూడా. అయితే ఆయనకు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు పడిన తపన అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. ఎంపీగా కూడా గెలిచారు. అయితే గెలిచిన ఆరు నెలలకే వైసిపి అధినాయకత్వాన్ని విభేదించారు.అధినేత జగన్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.రచ్చబండ పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.దీంతో అప్పటి వైసిపి ప్రభుత్వం రాజ ద్రోహం కేసు పెట్టింది.అక్రమంగా హైదరాబాదు నుండి తీసుకొచ్చి విచారణ పేరిట దాడి చేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. అప్పటినుంచి కూటమికి దగ్గరయ్యారు. ఎన్నికల్లో బిజెపి ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ రాజకీయ సమీకరణల్లో ఆయనకు చాన్స్ దక్కలేదు. దీంతో పొలిటికల్ జంక్షన్ లో నిలబడాల్సి వచ్చింది.అటువంటి సమయంలో చంద్రబాబు ఆదుకున్నారు.రఘురామకృష్ణం రాజుకు పిలిచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు.అక్కడ తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా.. ఆయనను తప్పించి మరీ చాన్స్ ఇచ్చారు.
* ఐదేళ్లుగా పోరాటం
అయితే గత ఐదేళ్లుగా రఘురామకృష్ణం రాజు చేసిన పోరాటం కూటమికి ఊపిరినిచ్చింది.అందుకే ఆయనకు కూటమి ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతుందని అంతా భావించారు. మంత్రి పదవి ఖాయమని టాక్ నడిచింది. కూటమి నేపథ్యంలో మూడు పార్టీలకు పదవులు సర్దుబాటు చేయాల్సి రావడం, టిడిపిలో సీనియర్లను సైతం పక్కనపెట్టడం వంటి కారణాలతో.. క్యాబినెట్లో రఘురామకృష్ణం రాజుకు చాన్స్ దక్కలేదు. అయినా సరే రఘురామకృష్ణం రాజు అసంతృప్తి వ్యక్తం చేయలేదు. తనకు కూటమిలో సరైన గౌరవం దక్కుతుందని సంతృప్తిగా ముందుకు సాగుతున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు.
* పవన్ ఒప్పుకుంటేనే
అయితే రఘురామకృష్ణం రాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ త్యాగం ఉంది. స్పీకర్ గా టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుకు అవకాశం ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ గా మిత్రపక్షమైన జనసేనకు ఇస్తామని చంద్రబాబు ముందుకు వచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు పరిస్థితిని గమనించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రధానంగా జనసేనకు చెందిన బొమ్మిడి నాయకర్,లోకం మాధవి వంటి వారి పేర్లు వినిపించాయి.కానీ రఘురామకృష్ణం రాజు కోసం జనసేన ఆ పదవి త్యాగం చేసింది. దీంతో రఘురామకృష్ణంరాజుకు లైన్ క్లియర్ అయ్యింది.