Ram Talluri: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరిని నియమించారు. ఇప్పటివరకు ఆ పదవిలో మెగా బ్రదర్ నాగబాబు ఉండేవారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను ఆయనే చూసేవారు. అయితే ఆయన స్థానంలో ఇప్పుడు రామ్ తాళ్లూరిని తీసుకున్నారు. ఇకనుంచి నాగబాబు స్థానంలో అన్ని బాధ్యతలు రామ్ చూడనున్నారు. దీంతో ఎవరి తాళ్లూరి రామ్ అంటూ ఎక్కువమంది ఆరా తీయడం ప్రారంభించారు. అసలు పవన్ ఎందుకు ఆయనకు అంత ప్రాధాన్యమిస్తున్నారు? దీని వెనుక ఉన్న లెక్కేంటి? అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది.
* చిత్ర పరిశ్రమతో అనుబంధం..
రామ్ తాళ్లూరి ( Ram Thalluri) ఓ ప్రవాస భారతీయుడు.. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పేరిట సినిమాల నిర్మాణం కూడా చేపట్టారు. లీడ్ ఐటీ కార్పొరేషన్, రామ్ ఇన్నోవేషన్ వంటి ఐటీ సంస్థల్లో డైరెక్టర్ గాను ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. గత కొన్నేళ్లుగా జనసేన కోసం పనిచేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీ సమస్త గత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను రామ్ తాళ్లూరి నిర్వర్తిస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
* పార్టీని బలోపేతం చేసేందుకే..
జనసేన( janasena ) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ తాళ్లూరి నియామకం. త్వరలోనే మరికొన్ని నియామకాలు ఉంటాయని కూడా తెలుస్తోంది. జనసేన కోసం సినీ పరిశ్రమకు చెందిన చాలామంది పనిచేస్తూ వచ్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పృథ్వి, జానీ మాస్టర్, హైపర్ ఆది వంటి వారు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి మెగా బ్రదర్ నాగబాబు సేవలందిస్తూ వచ్చారు. ఆయన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా ప్రచారం నడుస్తోంది. అయితే ముందు చాలామందికి జనసేన బాధ్యతలు అప్పగించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.