Vizag: విశాఖ పై( Visakhapatnam) ప్రత్యేక దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. విశాఖను ఐటీ హబ్ గా మార్చాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే చాలా కంపెనీలు విశాఖ నగరం వైపు మొగ్గుచూపాయి. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ తరుణంలో నగరంలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. ప్రధానంగా రహదారులకు ఇరువైపులా కనిపించే చిరు దుకాణాలను తొలగించారు. విశాఖ ఫుడ్ కోర్టులో వందలాది దుకాణాలు తొలగించబడ్డాయి. దీంతో నగరం సుందరంగా కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో వి.ఎం.ఆర్.డి.ఏ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రహదారులను అభివృద్ధి చేయనుంది. రూ.174 కోట్లతో ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లు ఖరారు చేసింది. పనులు కూడా ప్రారంభించింది.
* ప్రధాన ప్రాంతాలను కలుపుతూ..
విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ( bhogapuram International Airport) నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయాన్ని అనుసంధానించే జాతీయ రహదారిపై.. ప్రయాణికుల రద్దీని సులభతరం చేసేందుకు ఈ రోడ్లు నిర్మించనున్నారు. భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాలైన భీమిలి, ఆనందపురం, గంభీరం, అడవివరం, శొంఠ్యం వంటి ప్రాంతాల్లో ఈ రోడ్లు నిర్మిస్తున్నారు. విఎంఆర్డిఏ, జీవీఎంసీ, ఆర్ అండ్ బి సంయుక్తంగా ప్రతిపాదించిన 15 రోడ్లలో.. ఏడు రోడ్లకు కూటమి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. దీంతో వీటి పనులకు విఎంఆర్డిఏ టెండర్లను ఖరారు చేసింది. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీని కొంతవరకు నియంత్రించవచ్చు. ప్రయాణాలకు మరింత సులభతరం అయ్యే అవకాశం ఉంది.
* చంద్రబాబు ప్రత్యేక ఫోకస్.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు( CM Chandrababu) విశాఖ నగరం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తొలి ఏడాదిలోనే ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. కనెక్టింగ్ మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల కిందట ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి విఎంఆర్డిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా లభించింది. విశాఖలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు కీలకమైన రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు వీఎమ్ఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.
* భోగాపురం ఎయిర్పోర్ట్ కు..
ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ రోడ్లు జాతీయ రహదారికి( National Highway ) అనుగుణంగా ఉంటాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వాహనాల రద్దీ దృష్ట్యా.. విశాఖ నగరం నుంచి నిర్మిస్తున్న ఈ ఏడు రహదారులు ప్రయాణాలను మరింత సులభతరం చేయనున్నాయి. అయితే ఈ ఏడు రహదారులను ఒకే ప్యాకేజీ కింద పూర్తి చెయ్యాలని వీఎమ్ఆర్డిఏ ను ప్రభుత్వం ఆదేశించింది. 100 కోట్లు దాటిన నేపథ్యంలో ఇంజనీరింగ్ ప్రోక్యుర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మోడల్ కింద.. ఏడు రోడ్లకు సింగిల్ టెండర్ గా పిలిచారు. పనులు కూడా ప్రారంభించనున్నారు.