Deputy CM Pawan kalyan : ఏపీలో లడ్డు వివాదం రాజకీయాలను హీటెక్కించింది. తిరుమల లడ్డు తయారీకి సంబంధించి వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన వైపు గట్టి వాదనలు వినిపించారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు సరైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు. విజయవాడ దుర్గమ్మ మెట్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు. అయితే అదే సమయంలో వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ ఎదురయ్యింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలనుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారు అని జగన్ ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు.మరోవైపు తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.. చంద్రబాబు పాప ప్రక్షాళన చేసుకోవాలని భావించారు జగన్. కానీ డిక్లరేషన్ అంశం తెరపైకి రావడం,శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడంతో జగన్ వెనక్కి తగ్గారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.డిక్లరేషన్ అంశం జగన్ మెడకు చుట్టుకుంది. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని..బయటకు వస్తే అన్ని మతాలను గౌరవిస్తానని జగన్ చెప్పుకోవాల్సి వచ్చింది.తనకు తానుగా తాను క్రిస్టియన్ అని బయట పెట్టుకోవాల్సి వచ్చింది.
* పవన్ వెంట రెండో కుమార్తె
అయితే తాజాగా పవన్ తిరుమల వెళ్లారు.తన వెంట రెండో కుమార్తె పలిన అంజని కూడా వెళ్లారు.ఆమె తల్లి క్రిస్టియన్ కావడంతో పలిన అంజని డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్ పత్రంపై కుమార్తె బదులు పవన్ సంతకం చేశారు. మైనర్ కావడంతో ఆమె తరుపున పవన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబు లడ్డూ వివాదం వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సరిగ్గా ఇదే సమయంలోపవన్ కుమార్తె తరఫున డిక్లరేషన్ ఇవ్వడం విశేషం.
* ఆ నిబంధన తప్పనిసరి
టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు.. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాలి. వీఐపీ వర్గాలకు చెందిన వారైతే టీటీడీ అధికారులు వచ్చి డిక్లరేషన్ తీసుకుంటారు.సామాన్య భక్తులు అయితే క్యూ లైన్ లో ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తాము అన్యమతస్తులైనా.. తిరుమల శ్రీవారు అంటే తమకు అపార గౌరవం.. అందుకే దర్శనం చేసుకుంటామని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో అన్యమతస్తుడిగా గుర్తింపు పొందిన జగన్ మాత్రం డిక్లరేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. తాజాగా లడ్డు వివాదం నేపథ్యంలో జరిగిన రగడ అందరికీ తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చుకునే క్రమంలో జగన్ తిరుమల వెళ్లాలని భావించారు. డిక్లరేషన్ అంశం తెరపైకి రావడంతో వెనక్కి తగ్గారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ తన కుమార్తెను తీసుకుని వెళ్లి మరి డిక్లరేషన్ ఇవ్వడం విశేషం.
* వైసీపీకి కౌంటర్
తాజాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ అంశం వైసిపికి అనుకూలంగా మారిందన్న విశ్లేషణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కొన్ని రకాల అభ్యంతరాలు చెబుతూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పై కూడా వ్యాఖ్యానించింది. వైసీపీ కోరుతున్నట్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీకి ఈ అంశం అనుకూలంగా మారే అవకాశం ఉంది. అందుకే పవన్ డిక్లరేషన్ అంశాన్ని మరోసారి గుర్తు చేస్తూ తన కుమార్తె తరుపున తానే.. డిక్లరేషన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది వైసీపీకి కౌంటర్ ఇచ్చినట్లు అయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.