Kakinada MP Candidate: పవన్ దూకుడు పెంచారు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నారు. అందులో భాగంగా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. మంగళవారం పిఠాపురం నియోజకవర్గ జనసేన నేతలతో సమావేశమైన పవన్ ఈ విషయాన్ని వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరారు. ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటును కేటాయించనున్నారు. ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటును ఉదయ్ శ్రీనివాస్ కు కేటాయించడం విశేషం.
వాస్తవానికి కాకినాడ ఎంపీ స్థానాన్ని సానా సతీష్ కు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆయన సైతం ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఆయన లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. లోకేష్ తో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని జనసేనలోకి పంపించి కాకినాడ ఎంపీ సీటు నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే సానా సతీష్ జనసేనలో యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించారు. అయితే పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానంతో పాటు కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం ప్రారంభమైంది. అయితే తాజాగా పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను కాకినాడ నుంచి పోటీ చేయడం లేదని.. తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఉదయ్ తనకోసం ఎంతో త్యాగం చేశారని.. భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు.
అయితే ఇప్పుడు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఉదయ్ ఎవరంటే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టీ టైం’ వ్యవస్థాపకుడు. దుబాయిలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చారు ఉదయ్. రూ.5 లక్షల పెట్టుబడి తో టీ టైం ప్రారంభించారు. అటు తరువాత తన వ్యాపారాన్ని విస్తరించారు. అనతి కాలంలోనే 100 టీ టైం అవుట్ లెట్లను ప్రారంభించారు. ఏపీ తెలంగాణలో ప్రస్తుతం వందలాది బ్రాంచ్ లు నడుస్తున్నాయి. ఈ టైం నెలకు 25 కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తోంది. ప్రస్తుతం టీ టైం అవుట్ లెట్లు దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంది. 45 మంది ఉద్యోగులు సమస్త కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
ఉదయ్ పవన్ కళ్యాణ్ అభిమాని. వారాహి వాహన రూపకర్త కూడా ఈయనే. గతంలో పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ హామీ మేరకు ఆయన జనసేనలో చేరారు. ఒకవేళ ప్రధాని మోదీ, అమిత్ షా కోరిన మాదిరిగా పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఉంటే.. ఉదయ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఉండేవారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండడంతో.. ఉదయ్ ను కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సానా సతీష్ ప్రచారం చేసుకుంటుండగా.. ఆయన తప్పిస్తూ పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.