Adilabad: కుడుకలతో కుటుంబాల లెక్క.. ఆ గూడేల్లో అదో ఆచారం

కుడుకను ఆదివాసీల భాషలో దురాడీ కొబ్రే(హోలీ కుడక) అని పిలుస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో మాత్రమే ఈ పండుగ నిర్వహిస్తారు. హోలీకి ఒకరోజు ముందు గ్రామ పెద్ద తన ఇంట్లో కూర్చోని తమ గ్రామంలో ఎన్ని కొత్త కుటుంబాలు చేరాయి..

Written By: Raj Shekar, Updated On : March 20, 2024 11:42 am

Adilabad

Follow us on

Adilabad: ఆదివాసీలు అంటేనే భిన్నమైన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వేషధారణ, భాష, యాస కూడా వేరేగా ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ గూడేలు కూడా ఇలాగే భిన్నంగా ఉంటాయి. ఇక హోలీ పండుగను వీరు జరుపుకునే తీరే వేరు. దురాడిగా హోలీ పండుగను పిలుస్తూ అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. ఇక ఆదివాసీలు ఊళ్లో ఉండాలంటే.. కాముడి దహనం రోజు గ్రామ పెద్దలకు కుడుక ఇవ్వాల్సిందే. అలా ఇస్తేనే ఆ కుటుంబం గ్రామ జాబితాలో ఉన్నట్లు పరిగణిస్తారు. కుడుక ఇవ్వని వారు గ్రామం నుంచి వెళ్లిపోయినట్లుగా భావిస్తారు. కుడుక ఇవ్వకుండా గ్రామంలో ఉంటే వారితో గ్రామస్తులకు ఎలాంటి సంబంధాలు ఉండవు. వాళ్ల ఇంట్లో ఏ కార్యక్రమం జరిగిన గ్రామస్తులు వెళ్లరు.

దురాడీ కొబ్రేతో కుటుంబాల లెక్క
కుడుకను ఆదివాసీల భాషలో దురాడీ కొబ్రే(హోలీ కుడక) అని పిలుస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో మాత్రమే ఈ పండుగ నిర్వహిస్తారు. హోలీకి ఒకరోజు ముందు గ్రామ పెద్ద తన ఇంట్లో కూర్చోని తమ గ్రామంలో ఎన్ని కొత్త కుటుంబాలు చేరాయి.. ఎన్ని కుటుంబాలు ఊరు వదిలి వెళ్లాయనేది గ్రామస్తులు ఇచ్చిన కుడుకల ఆధారంగా లెక్కిస్తారు. కొత్తగా కాపురాలు పెట్టిన వారుకూడా ఈ రోజే గ్రామ జాబితాలో చేరడానికి అవకాశం ఉంటుంది. అందుకే బతుకుదెరువు కోసం వేరే ప్రాంతానికి వెళినా ఉద్యోగ, రాజకీయ రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారుకూడా హోలీకి తప్పకుండా స్వగ్రామానికి వస్తారు. తరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆదివాసీలు నేటికీ పాటిస్తున్నారు.

కాముడి దహనం…
ఇక హోలీకి ఒకరోజు ముందు కుడుకలు సేకరించిన అనంతరం అటవీప్రాంతం నుంచి మాతారి, మాత్రాల్‌ (వృద్ధురాలు.. వృద్ధుడు) పేర్లతో తీసుకొచ్చిన రెండు వెదురు బొంగులకు ఇళ్ల నుంచి సేకరించిన కుడుక ముక్కలు, చక్కెర బిళ్లల హారాలు, ఉల్లి మొక్కలు, నైవేద్యం, మోదుగపూలతో పేర్చి గ్రామ పొలిమేరలో సంప్రదాయ వాయిద్యాల మధ్య కాముడిదహనం చేస్తారు. ఆ స్థలంలో రాత్రంతా జాగారం ఉంటారు. జాజిరిరూపంలో ఇళ్లనుంచి సేకరించిన నవధాన్యాలతో గుడాలు వండడంతోపాటు ఆ రోజు దొంగిలించి తెచ్చిన కోళ్లు, మేకపోతులను ఆస్థలంలో బలిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. మరుసటి రోజు బావ బావమరుదులు, చిన్నాపెద్ద తేడాలేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ నృత్యం చేస్తారు.

బూడిదను పవిత్రంగా..
కాముడి దహనం చేసిన బూడిదను ఆదివాసీలు పవిత్రంగా భావిస్తారు . ఆ బూడిదను ఇళ్ల ముఖద్వారాల వద్ద గీతగా వేస్తారు. ఇలా వేస్తే ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లోకి రావని ఆదివాసీల నమ్మకం. అంతేకాకుండా ఆదివాసీ గ్రామాల్లో అతి పవిత్రంగా నిర్వహించే దండారీ ఉత్సవాల్లో కాముడి దహనం బూడిదకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. గుస్సాడీల వేషధారణకు ఈ బూడిదను ఉపయోగిస్తారు.