Pawan kalyan and Ysrcp : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 4 నాటికి ఏడాది అవుతుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోయినందున ఆరోజున నిరసన దినంగా పాటించాలని వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఇప్పటికే ఆ పార్టీ అన్ని విధాల సన్నాహాలు చేసుకుంటోంది. పోస్టర్లను సైతం విడుదల చేసింది. అయితే దీనిపై అనూహ్యంగా జనసేన ముందుకు వచ్చింది. జూన్ 4వ తేదీన సంక్రాంతి, దీపావళి కలిపి సంబరాలు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. దీంతో జూన్ 4 ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా చెబుతుండగా.. జనసేన పీడ విరగడ దినంగా జరుపుకోవాలని సూచిస్తోంది. దీంతో అందరి దృష్టి జూన్ 4 పై పడింది.
* నిత్యం ఏదో ఒక వివాదం..
అయితే ఏపీలో విచిత్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల జరిగి ఏడాది మాత్రమే అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party) దారుణంగా ఓడిపోయింది. అయినా సరే ఏపీలో నిత్య రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యరోపణలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక అంశం వివాదం అవుతూనే ఉంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రావాలని బలంగా నిర్ణయించింది. అందుకు జూన్ 4 ను ఎంచుకుంది. ఆరోజు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలకు వెన్నుపోటు పొడిచారని బలంగా తీసుకెళ్లేలా ఆరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో అన్ని జిల్లాల నాయకత్వాలు స్పందించాయి. పోస్టర్లను ఆవిష్కరించాయి. మండలం నుంచి జిల్లా స్థాయి వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇటువంటి తరుణంలో జనసేన రంగంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తోంది.
Also Read: జగన్ హత్యకు ప్లాన్.. మాజీ ఐపీఎస్ సూత్రధారి.. ఆప్తుడి సంచలనం!
* ఆరోజు జనసేన సంబరాలు..
నిన్ననే రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ( ration distribution) ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. జూన్ 4న కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో సంక్రాంతి, దీపావళి కలిపి నిర్వహించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరోజు దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు మంత్రి మనోహర్. దీంతో ఆరోజు వైయస్సార్ కాంగ్రెస్ వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి ఉంటుంది. జనసేన ఆంధ్రప్రదేశ్ పీడ విరగడ అయిన దినంగా జరుపుకోవాలని భావిస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో అందరి దృష్టి జూన్ 4 పై పడింది. ఆరోజు ఏం జరుగుతుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ప్రధాన పాలకపక్షంగా తెలుగుదేశం ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఇప్పుడు జనసేన రంగంలోకి దిగడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
* పవన్ ఫుల్ ఫోకస్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఆ పార్టీకి ఎంత మాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఆ పార్టీ చేసే కుట్రలు, కుతంత్రాలు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తున్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం రావణకాష్టంలా మారుతుంది అన్నది పవన్ అభిప్రాయం. అందుకే కూటమిలో ఇబ్బందులు వచ్చినా అధిగమించి.. మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండేలా పవన్ చొరవ చూపుతారని తెలుస్తోంది. అందులో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేక ఫోకస్ తో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.